2025 జూన్ వరకు పోలవరం గడవు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన గడువును తాజాగా 2025 జూన్ వరకు పొడిగించారు. మొన్నటిదాకా 2024 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చి.. ఇప్పుడు 2025 జూన్‌కు పూర్తవుతుందని అంటోంది. ‘‘41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేసి.. సార్వత్రిక ఎన్నికల్లోగా అంటే 2024 ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు’’ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పగా… అదేంకాదు, 2025 జూన్‌ నాటికిగానీ పనులు పూర్తి కావని రాష్ట్ర అధికారులు తేల్చేశారు.
అదికూడా… 41.15 మీటర్ల కాంటూరుకే! గురువారం ఢిల్లీలోని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న  ఏపీ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అంతకంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. 
41.15 మీటర్ల కాంటూరులో నిర్మాణ పనులు, భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎంత వ్యయమవుతుందో చెప్పాలని షెకావత్ రాష్ట్రాన్ని అడిగారు. రూ.17,144 కోట్లుగా అంచనా వేశామని జల వనరుల శాఖ అధికారులు నివేదించారు. డయాఫ్రం వాల్‌ మరమ్మతుల కోసం కావలసిన రూ.1,556 కోట్లు కూడా కలిపితే అంచనా వ్యయం రూ.18,700 కోట్లకు చేరుకుందని తెలిపారు. కీలకమైన డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా డిజైన్లకు ఆమోదం లభించలేదా అని జల సంఘాన్ని షెకావత్‌ ప్రశ్నించారు. త్వరితగతిన ఆమోదించాలని ఆదేశించారు.
సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని వెల్లడించారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని నారాయణరెడ్డి  వెల్లడించారు. ఈ ఎత్తు వరకు ఎంత మేర ముంపు జరుగుతుందో ఆ మేరకు పరిహారం, పునరావాసం కల్పించేందుకు నిధులను విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు.
 
అలాగే నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ అడహక్ నిధుల కింద రూ. 17,414 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగిందని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.