`శివలింగం’ కార్బన్ డేటింగ్ వాయిదా వేసిన సుప్రీం

`శివలింగం’ కార్బన్ డేటింగ్ వాయిదా వేసిన సుప్రీం

గత ఏడాది వీడియోగ్రాఫిక్ సర్వేలో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన  ‘శివలింగం’ వయసును శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్ డేటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. శివ లింగం కార్బన్ డేటింగ్ మెరిట్ ఆధారంగా పరిశీలించడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతించింది.

అయితే ఉత్తర్వులో ఉన్న చిక్కులు, ఆర్డర్‌లో సంబంధిత ఆదేశాల కారణంగా అమలు తదుపరి తేదీకి వాయిదా వేయబడింది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

‘శివలింగం’ వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానాలనుబట్టి చూసినపుడు, దీనిపై మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని తెలిపింది.  సర్వే సమయంలో గత ఏడాది మే 16న మసీదు ఆవరణలో కనపడిన దానిని హిందువులు ‘శివలింగం’ అని, ముస్లింలు ‘ఫౌంటైన్’ అని వాదిస్తున్నారు.

కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే ఈ మసీదు కూడా ఉంది. శివలింగం కార్బన్ డేటింగ్, శాస్త్రీయ సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తును 2022 అక్టోబర్ 14న వారణాసి జిల్లా న్యాయమూర్తి తిరస్కరించిన ఆదేశాలను మే 12న హైకోర్టు పక్కన పెట్టింది.

‘శివలింగం’ పై శాస్త్రీయ పరిశోధన జరపాలని హిందూ ఆరాధకులు పెట్టుకున్న దరఖాస్తుపై చట్ట ప్రకారం కొనసాగాలని వారణాసి జిల్లా న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు లక్ష్మీదేవి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు.