మణిపూర్ హింసపై అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం

మణిపూర్ హింసపై అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
కొద్ది రోజుల కిందట మణిపూర్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో 60 మందికి పైగా మరణించారు. ఈ విషయమై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, కొందరు కేబినెట్ మంత్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
 
ముఖ్యమంత్రి, నలుగురు కేబినెట్‌ మంత్రులు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  కేంద్ర హోంమంత్రిని కలిశారని ప్రభుత్వ అధికార ప్రతినిధి సపమ్‌ రంజన్‌ సింగ్‌ వెల్లడించారు  అయితే  అమిత్ షాతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను మాత్రం రంజన్ సింగ్ వెల్లడించలేదు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటన గురించి ఇంఫాల్‌లో విలేకరులకు వివరిస్తారని చెప్పారు.
 
హింసాత్మక ఘర్షణల తరువాత మణిపూర్ నుంచి 5,800 మందికి పైగా ప్రజలు మిజోరాంకు వెళ్లిపోయారు. పొరుగు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తలదాచుకున్నారు. మిజోరంలోని ఆరు జిల్లాల్లో చిన్-కుకి-మిజో కమ్యూనిటీకి చెందిన మొత్తం 5,822 మంది తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
 
 ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2,021 మంది, కొలాసిబ్‌లో 1,847 మంది, సైచువల్‌లో 1,790 మంది ఉన్నారని అధికారులు వివరించారు. గిరిజనులకు ప్రత్యేక పరిపాలన కోసం మణిపూర్ గిరిజన శాసనసభ్యుల డిమాండ్‌కు మిజోరాం లోక్‌సభ సభ్యులు సి.లాల్‌రసంగ మద్దతు ప్రకటించారు. మణిపూర్ ప్రభుత్వంలో గిరిజన ప్రజలు ఇకపై జీవించలేరని పేర్కొంటూ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 10 మంది కుకీ శాసనసభ్యులు కూడా కేంద్రాన్ని కోరారు. వీరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం