మహబూబ్‌నగర్, షాద్‌నగర్ లో రైళ్ల స్టాప్‌ కై వినతి

మహబూబ్‌నగర్, షాద్‌నగర్ లో రైళ్ల స్టాప్‌ కై వినతి
యశ్వంత్‌పూర్ టు హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును (రైలు నెం. 12649/12650) కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా ఇటీవల రూ.1,410 కోట్లతో 85 కిలోమీటర్ల పొడవున సికింద్రాబాద్ టు మహబూబ్ నగర్‌ల మధ్య నిర్మించి, విద్యుద్దీకరించిన డబ్లింగ్ రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
మధ్యలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో ఈ రైలుకు స్టాప్ ఏర్పాటుచేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ వ్రాసారు. తద్వారా ఢిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని లేఖలో ఆయన తెలిపారు.
దీంతోపాటుగా చెంగల్‌పట్టు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17651/17652)కు షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ సబర్భన్ ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
 
 తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్య క్రమాలను ప్రస్తావిస్తూ ఇంతవరకు అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ, సహకారాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.