కశ్మీర్లో ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్ల మృతి

కశ్మీర్లో ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్ల మృతి
జమ్మూ కశ్మీరులో  ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదుల బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి చెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు. రాజౌరీ జిల్లాలోని కొండి అడవిలో శుక్రవారం ఉగ్రవాదులు అమర్చిన బంబు పేలుడులో ప్రత్యేక దళాలకు చెందిన ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తలించగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూ ప్రాంతంలోని భాగా ధూరియాకు చెందిన తోతా గలి ప్రాంతంలో గత నెల ఒక సైనిక ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రత్యేక దళాలు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు ఆర్మీకి చెందిన ఉత్తర కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
 
కోడి అడవిలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఉమ్మడి దళాలకు చెందిన సైనిక బృందం మే 3వ తేదీ నుంచి గాలింపు చర్యలు చేపట్టినట్లు సైన్యం తెలిపింది. ముఖ్యంగా గత నెలలో సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేయడంతో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.
 
నాటి నుంచి మిలిటెంట్ల కోసం ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. రాజౌరీ సెక్టార్లోని కంది అటవీ ప్రాంతంలోని సంక్లిష్ట పర్వత ప్రదేశంలో చిక్కుకుపోయిన కొందరు ఉగ్రవాదులు ఆర్మీ సెర్చ్ టీమ్ కు శుక్రవారం ఉదయం ఎదురయ్యారు. ఆర్మీ జవాన్లను చూడగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. హ్యాండ్ గ్రెనేడ్లను విసిరారు.

వెంటనే తేరుకున్న సైనికులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి అదనపు సైనిక బలగాలను తరలించినట్లు సైన్యం తెలిపింది. గాయపడిన సైనికులను ఉధంపూర్ లోని ఆర్మీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.