గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీటీడీ హిందూ ధర్మ ప్రచారం

గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీటీడీ హిందూ ధర్మ ప్రచారం

గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాల నిర్మాణం ద్వారా టీటీడీ  పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేస్తోందని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కొనియాడారు.  పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన  శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో  బుధవారం శారద పీఠాధిపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ  ఇదివరకు అరకు, పాడేరు తదితర గిరిజన ప్రాంతాల్లో దాదాపు 40 ఆలయాల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇదేక్రమంలో గిరిజన ప్రాంతమైన సీతంపేటలో  శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం అద్భుతంగా నిర్మించారని అభినందించారు. ఈ నెలలోనే రంపచోడవరంలో టీటీడీ శ్రీవారి ఆలయానికి మహాసంప్రోక్షణ జరుగనుందని చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లోని అమాయక గిరిజనులను కొన్ని విదేశీ మతాలవారు మతమార్పిడులు చేయిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఆంజనేయుడు గిరిజనుల దేవుడని, ఆంజనేయుడి సహకారంతోనే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించారని  తెలిపారు. ఈ ఆలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాల రోజుల్లో తమ పీఠం తరపున కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.

ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన టీటీడీ ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి వి.కళావతిలకు అభినందనలు తెలియజేశారు. జెఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీతంపేటలో నాలుగు ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. తిరుపతికి రాలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. భక్తుల కోసం కల్యాణ మండపం నిర్మించామని చెప్పారు. మహాసంప్రోక్షణ అనంతరం సీతంపేట పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.