
ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) పధకం విజయవంతమైంది. జన్ ఔషధి కేంద్రాల ద్వారా బ్రాండెడ్ మెడిసిన్స్ కంటే 50–90 శాతం తక్కువ ధరకే జనరిక్ ఔషధాలను ప్రభుత్వం అమ్ముతోంది. దేశంలో క్రమంగా జనరిక్ ఔషధాల అమ్మకాలు పెరుగుతున్నాయి.
ఈ పథకం కింద దేశంలో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో జన ఔషధి కేంద్రాల అమ్మకాలు రూ.1,236 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే అమ్మకాలు 38 శాతం పెరిగాయి. ఈ పథకంలో జనరిక్ ఔషధాల అమ్మకాలు ఐదు సంవత్సరాల్లో రూ. 775 కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వం సవరించిన లక్ష్యం రూ.1,200 కోట్లను కూడా అధిగమించారు.
లక్ష్యాన్ని మించి అమ్మకాలు జరిగినట్లు ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) సీఈఓ రవి దధీచ్ చెప్పారు. ప్రధానంగా జనరిక్ మెడికల్ షాపులు జన ఔషధి కేంద్రాలను భారీగా పెంచినట్లు తెలిపారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడం, ప్రధాన మంత్రితో పాటు మంత్రులు కూడా దీనిపై ప్రజల్లో బాగా ప్రచారం చేయడం కూడా అమ్మకాలు పెరిగేందుకు తోడ్పడిందని తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో 9,300 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ మెడికల్ షాపుల్లో అమ్మకానికి 1,800 రకాల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌ను అందుబాటులో ఉంచారు. ఆర్థికంగా రోగులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం జనరిక్ ఔషధాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది.
వీటితో పాటు 285 రకాల సర్జికల్స్, న్యూట్రాస్యూటికల్స్, వైద్య పరికరాలను విక్రయిస్తున్నారు. జన ఔషధి మెడికల్ షాపుల్లో ముందులన్నీ బ్రాండెడ్ మందులతో పోల్చుకుంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయి. మెడికల్ షాపులను చిన్న వ్యాపారులే నడిపిస్తున్నారు. టెండర్ల ద్వారా మందులను సేకరిస్తున్న పీఎంబీఐ వాటిని ఈ షాపులకు సరఫరా చేస్తోంది.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో జనరిక్ మెడికల్ షాపుల సంఖ్యను 10 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు రవి దధీచ్ చెప్పారు. ప్రభుత్వం 651 జిల్లాల నుంచి ఈ మెడికల్ షాపుల ఏర్పాటుకు అప్లికేషన్లను ఆహ్వానించింది. జనరిక్ మెడిసిన్స్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం తయారు చేస్తున్న కంపెనీల నుంచే సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు