బీజేపీలో చేరిన రాజగోపాలాచారి మనుమడు

బీజేపీలో చేరిన రాజగోపాలాచారి మనుమడు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు, తమిళనాడు కాంగ్రెస్ లో కీలక నేత సీఆర్ కేశవన్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.  సీఆర్ కేశవన్ కాంగ్రెస్ లో గత 22 ఏళ్లుగా ఉన్నారు.
 
పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. పార్టీని వీడే నాటికి ఆయన తమిళనాడు కాంగ్రెస్ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ కు ట్రస్టీ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సీఆర్ కేశవన్ ఫిబ్రవరి 23న ప్రకటించారు.  అయితే, తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆ సమయంలో ఆయన చెప్పలేదు. కొత్త మార్గంలో వెళ్లబోతున్నానని మాత్రం చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పై కేశవన్ పలు విమర్శలు చేశారు.
 
కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి విలువలు ఇప్పుడు లేవని, ఇప్పుడు పార్టీ చైతన్య రహితంగా, నిష్క్రియాత్మకంగా మారిందని ధ్వజమెత్తారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు కానీ, ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు కానీ చేయడం లేదని విమర్శించారు. గత రెండు దశబ్దాలుగా పార్టీ కోసం పని చేశానని చెప్పారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనీ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత బీజేపీలో వరుసగా చేరిన మూడో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేశవన్.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తమిళనాడులో పర్యటిస్తున్న రోజే  ఢిల్లీలో బిజెపి కార్యాలయంలో కేంద్ర మంత్రి వికె సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై కేశవన్  ప్రశంసలు గుప్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీలోకి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘‘సామాన్య ప్రజలే కేంద్రంగా ప్రధాని మోదీ విధానాలను రూపొందిస్తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. సంస్కరణలతో అభివృద్ధి కేంద్రంగా మోదీ సాగిస్తున్న పాలన వల్ల అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది’’ అని కేశవన్ ప్రశంసించారు.