అమరావతి గురించి హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జులై 11న చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. అంతకు ముందు దీని విచారణ సాధ్యం కాదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.
హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రైతుల పిటిషన్లు వేశారు. రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం కోర్టును పదేపదే విజ్ఞప్తి చేసినా ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు.
అమరావతి పిటిషన్లపై విచారణ జరపడానికి కె.ఎం.జోసెఫ్ ఆసక్తి చూపించలేదు. జూన్ 16న కె.ఎం.జోసెఫ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అమరావతి పిటిషన్లపై విచారణ ముగించడం సాధ్యపడదని భావించారు. దీంతో కేకే.వేణుగోపాల్, నిరంజన్ రెడ్డి, నఫ్డే తదితరులు తమ వాదనలు గంటలోగా ముగిస్తామని ప్రాధేయపడిన న్యాయమూర్తి పిటిషన్లను వినడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
మరోవైపు అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా కోర్టు విచారణ వాయిదా వేయడం ఏపీ ప్రభుత్వానికి నిరాశ కలిగించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో కోరింది. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నంను చేయొచ్చని భావించారు. విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి కోర్టు అనుమతిస్తుందని భావించినా అలా జరగలేదు.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు