కాంగ్రెస్కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుస్తారని తెలుస్తున్నది.
 
ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను విడిచిపెట్టి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గానూ పని చేశారు. ఏపీ విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినా ఆ తర్వాత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.  2014 ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు. ఆ తర్వాత పార్టీకి పూర్వవైభవం తెస్తారని భావించినా ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌చేపట్టిన జోడో యాత్రకు కూడా నల్లారి దూరంగా ఉన్నారు.

గత రెండు నెలలుగా బీజేపీ అగ్ర నేతలు నల్లారితో టచ్‌లో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖలో చేరాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పార్టీలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు నల్లారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ప్రవేశంపై స్పందిస్తూ కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి అమరనాథ్ రెడ్డి కాంగ్రెస్ లో బలమైన నేత. ఆయన మృతిచెందడంతో రాజకీయ వారసునిగా ఎమ్యెల్యేగా పోటీ చేసి రాజకీయాలలో వచ్చారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఉంటూ వచ్చారు.
 
అయితే తన రాజకీయ ప్రత్యర్థి డా. పి రామచంద్రారెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోద్భలంతో 2009లో రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆగ్రహంతో ఉంటూ వచ్చారు. అప్పటినుండి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.