ఘణపూర్ ఎమ్మెల్యే వేధింపులని ఓ సర్పంచ్ ఆవేదన

ఘణపూర్ ఎమ్మెల్యే వేధింపులని ఓ సర్పంచ్ ఆవేదన
ఎమ్యెల్యే వేధింపులకు తట్టుకోలేక జగిత్యాలలో మునిసిపల్ చైర్ పర్సన్ పదవికి, బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఓ మహిళా బీజేపీలో చేరిన కొద్దీ రోజులకే,  హన్మకొండ జిల్లా స్టేషన్. ఘణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను కోరికలు తీర్చాలంటూ వేధించాడని అంటూ ఓ దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది.
 
 తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ, ఒక దళిత మహిళా సర్పంచ్ నని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ కురసపెళ్లి నవ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట కాదనడంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని తెలిపారు.
 
ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనంగా, లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకుంది.  ఎమ్మెల్యే మాట కాదనడంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
మీకు అక్కా చెల్లెల్లు లేరా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆస్తులు, బంగారం, పొలాలు అమ్ముకుని రాజకీయం చేస్తున్నామని పేర్కొన్నారు. నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చామని ఆమె స్పష్టం చేశారు.
 
నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని ఆమె ఆరోపించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ వేలేరులో పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి అయిన తనను తీవ్రంగా అవమానించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సదరు నేత మహిళలతో మంచిగా వ్యవహరించాలని ఆమె హితవు పలికారు.