త్వరలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

దేశంలో త్వరలో మరో వందే భారత్ సెమీ-స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దన్వే వెల్లడించారు. ముంబై – గోవా మార్గంలో ఈ రైలు నడవనుంది. కొందరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన ఈ సమాచారం ఇచ్చారు.
 
ముంబై – గోవా మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానున్నట్టు మంత్రి తమతో చెప్పారని మహారాష్ట్ర కొంకణ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిరంజన్ దవ్‍ఖరే వెల్లడించారు. రైల్వే సమస్యలపై మంత్రి దన్వేను మహారాష్ట్ర శాసనసభ, మండలి ప్రతినిధులు కలిశారు. ఈ సమావేశంలోని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురించి మంత్రి వెల్లడించారు.

 గత నెలలో ముంబై – షిర్డీ, ముంబై – సోలాపూర్ మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మొదలయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గింది. ఇదే విధంగా ముంబై-గోవా మధ్య కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రి చెప్పారని నిరంజన్ వెల్లడించారు.

ముంబై-గోవా రైల్వే రూట్‍లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిందని, ఇన్‍స్పెక్షన్ తర్వాత కొత్త ట్రైన్ సర్వీస్ మొదలవుతుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బృందంతో కేంద్ర మంత్రి దన్వే చెప్పారు. థానే, కొంకణ్ పరిధిలో రైల్వే సంబంధిత సమస్యల గురించి చర్చించేందుకు శాసనసభ, మండలి ప్రతినిధులు.. మంత్రితో సమావేశమయ్యారు.

రైల్వే ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమయ్యే వారికి స్టాళ్ల కేటాయింపు, ప్రతీ రైల్వే స్టేషన్‍లో రైతులకు మొబైల్ స్టాల్స్ కేటాయింపు, ప్లాట్‍పామ్‍ల ఎత్తు పెంపు, రైల్వే వంతెనలు వరద ముంపునకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చలు జరిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. గత నెలలో ముంబై – సోలాపూర్, ముంబై – షిర్డీ మధ్య రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది.

 దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. వేగంతో పాటు మంచి సదుపాయాలు ఉండడంతో ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ టికెట్ ధరలు కాస్త అధికంగానే ఉన్నా వేగం, సమయపాలన విషయంలో మెరుగ్గా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.