కడప సీట్ కోసమే వివేకానందరెడ్డి హత్య… సిబిఐ నిర్ధారణ!

కడప సీట్ కోసమే వివేకానందరెడ్డి హత్య… సిబిఐ నిర్ధారణ!
ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు క్రమంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నది,   కడప ఎంపి టికెట్‌ విషయంలో రాజకీయ వైరుధ్యం వల్లే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు అవినాష్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుట్ర పన్నారని సిబిఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
 
వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని, అవినాశ్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసునని , అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ పాత్ర వుందని సిబిఐ పేర్కొనడం రాజకీయ దుమారం రేపుతోంది.
 
ఈ కేసులో రెండోసారి, ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసిన తేదీకి రెండు రోజుల ముందే ఈ విధంగా సిబిఐ హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలలో పేర్కొనడం గమనార్హం. హత్య కేసులో ఏ2గా వున్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ లో ఈ విషయాలను వివరించింది.


కడప ఎంపి టికెట్‌ తనకుగానీ లేదా విజయమ్మ, షర్మిలలో ఒకరికి ఇవ్వాలని వివేకా పట్టుబట్టారు. అదే టికెట్‌ అవినాష్‌ కూడా ఆశించారు. ఈ నేపథ్యంలో వివేకా, అవినాష్‌ మధ్య వైరుధ్యం పెరిగింది” అంటూ సిబిఐ పేర్కొన్నది.

 
వివేకానందరెడ్డి రాజకీయ కదలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డికి నచ్చలేదని, శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని తెలిపింది. సునీల్‌ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి పక్కా ప్లాన్‌ ప్రకారం వివేకాను హత్య చేశాడని పేర్కొంటూ హత్య జరిగిన రోజు రాత్రి వైఎస్‌.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్‌ యాదవ్‌ వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 

ఇదిలావుండగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. 2019, మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందుల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, దీనిని సిబిఐకి బదిలీ చేయాలని తాము హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సౌభాగ్యమ్మ తెలిపారు.