వయస్సుతో సంబంధం లేకుండా అవయవ మార్పిడికి నమోదు

వయస్సుతో సంబంధం లేకుండా అవయవ మార్పిడికి నమోదు
చట్టప్రకారం అవయవ మార్పిడికి ఉన్న నిబంధనను కేంద్రం సడలించింది. ఈ సడలింపుతో ఏ వయసు వారైనా అవయవ మార్పిడికి నమోదు చేసుకునే వీలుంది. భారత్‌లో మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం (1994) ప్రకారం 65 ఏళ్ల పైబడిన రోగులకు అవయవ మార్పిడికి నమోదు చేసుకునే అవకాశం లేదు.
 
ఈ నిబంధనను తాజాగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సడలించింది. ఈ మార్పు వల్ల ఏ వయసువారైనా అవయవమార్పిడికి నమోదు చేసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువ పత్రాలను అడగకూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే అవయవ గ్రహీతల రిజిస్ట్రేషన్లకు రుసుము వసూలు చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.
 
కాగా ఈ నిబంధన సడలింపును గత సంవత్సరం గుజరాత్‌ హైకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఈ ఫీజు రూ.5 వేల నుండి పది వేల వరకు ఉంటుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ఇక ప్రతి సంవత్సరం 1.8 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. అయితే వీరిలో మూత్రపిండాల మార్పిడి 6 వేల మందికే జరుగుతోంది.
 
ఇక ఏడాదిలో రెండు లక్షల మంది లివర్‌ ఫెయిల్యూర్‌, లేక లివర్‌ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే వీరిలో 10-15 శాతం రోగులకు మాత్రమే సకాలంలో కాలేయ మార్పిడి జరుగుతోంది. ఇక ప్రతి ఏడాది 50 వేల మంది గుండె వైఫల్యాలతో బాధపడతున్నారు. కేవలం 10 నుంచి 15 రోగులకు మాత్రమే గుండె మార్పిడి జరుగుతున్నది. కార్నియా విషయంలో ప్రతి ఏడాది లక్షమందిలో 25 వేల మందికి మాత్రమే మార్పిడులు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పేర్కొంది.