
భారత సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతోన్న చైనా ఓ వ్యూహం ప్రకారం భారత సరిహద్దుకు అత్యంత చేరువగా గ్రామాలను నిర్మిస్తూ, ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తోంది. భవిష్యత్తులో భారత్ తో యుద్ధం చేయాల్సివస్తే సరిహద్దులకు తన సైన్యాన్ని వేగంగా చేర్చడానికి ఈ సదుపాయాలను డ్రాగన్ ఉపయోగించుకునే వీలుంది.
చైనా సైన్యం చర్యలను నిశితంగా గమనిస్తోన్న భారత్ డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టే పెట్టేందుకు సమాయత్తం అవుతుంది. ఇందుకోసం మోదీ ప్రభుత్వం మూడు అంచెల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. కొత్తగా ఏడు ఐటీబీపీ బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు వైబ్రెంట్ విలేజ్ స్కీమ్‌కు, షిన్‌కున్ లా సొరంగం తవ్వకానికి అనుమతులు ఇచ్చింది. పైకి చూస్తే ఇవన్నీ మూడు వేర్వేరు నిర్ణయాలుగా కనిపిస్తాయి. కానీ చైనా కోణంలో చూస్తే ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నవే.
పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి ఉన్నట్టుగానే ఇకపై చైనా సరిహద్దుల్లోనూ భారత్ మూడంచెల వ్యూహాన్ని అనుసరించనుంది. ‘వన్ నేషన్ వన్ ఫోర్స్’ పాలసీలో భాగంగా 3488 కి.మీ. పొడవైన ఎల్ఏసీ వెంబడి 56 బెటాలియన్ల బలగాలను మోహరించనుంది. సరిహద్దు దళానికి బ్యాకప్‌గా భారత సైన్యం ఉంటుంది. వాటికి అండగా ఆర్మీ రిజర్వ్ దళాలు ఉంటాయి.
సరిహద్దుల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటిబిటి)లో మరో ఏడు కొత్త బెటాలియన్ల ఏర్పాటు సంబంధిత నిర్ణయానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో ఐటిబిటిలోకి కొత్తగా మరో 9400 మంది జవాన్లు చేరుతారు. 1962 లో చైనా దురాక్రమణ తరువాతి దశలో ఐటిబిపి ఏర్పాటు అయింది. ఇప్పుడడు దాదాపు 90000 మంది సిబ్బందితో ఉంది. సరిహద్దులలో ప్రత్యేకించి చైనా వెంబడి భద్రత విషయంలో ఐటిబిటి కీలక పాత్ర పోషిస్తోంది.
కొత్తగా ఏర్పాటు చేసే ఏడు బెటాలియన్లు 47 బోర్డర్ పోస్టుల భద్రతను పర్యవేక్షించనున్నాయి. వీటిలో ఒకటి లడఖ్‌లో ఉండగా, మరొకటి ఉత్తరాఖండ్‌లో, మిగతావి అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లో ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో సెక్టార్ హెడ్ క్వార్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. డీఐజీ ర్యాంక్ అధికారి దీని బాధ్యతలను పర్యవేక్షిస్తారు.
అరుణాల్‌చల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి సెక్యూరిటీ గ్యాప్స్ పూడ్చడం కోసం వైబ్రంట్ విలేజ్ స్కీంలో భాగంగా సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కనెక్టివిటీ, ఇతర సదుపాయాలను మెరుగుపర్చడం కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ. 2500 కోట్లను కనెక్టివిటీని మెరుగపర్చడం కోసమే ఖర్చు చేస్తారు.
నాలుగు రాష్ట్రా లు, సరిహద్దు ప్రాంతంలోని కేంద్ర పాలిత ప్రాంతంలోని 19 జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారు. ఇప్పటి సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఈ కొత్త పథకాన్ని అమలులోకి తీసుకువస్తారు. దీని వల్ల యువతకు వాణిజ్యం, పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా సరిహద్దు గ్రామాల యువత ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద నగరాలకు వలస వెళ్లడం తగ్గుతుంది.
ఈ పథకాన్ని హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్థాఖ్‌లలో అమలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. వాతావరణాలకు తట్టుకునే రహదారులు, తాగునీరు, సౌర, వాయు విద్యుత్ కల్పనతో 24 గంటల కరెంటు, మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానం, పర్యాటక కేంద్రాలు, బహుళార్థక కేంద్రాలు, ఆరోగ్య స్వస్థత సెంటర్ల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు.
ఇక మోదీ సర్కారు తీసుకున్న మూడో నిర్ణయం.. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ మధ్య అన్ని సీజన్లలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు వీలుగా 4.1 కి.మీ. పొడవైన షింకున్ లా సొరంగాన్ని నిర్మించడం. దీని ద్వారా సరిహద్దులకు బలగాలు, ఆయుధాల తరలింపు తేలికవుతుంది. ఈ సొరంగాన్ని రూ.1681.5 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించనుంది. 2025 డిసెంబర్లోగా ఈ టన్నెల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది