నాగ్‌పూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

నాగ్‌పూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో  నాగ్‌పూర్ లో జరుగుతున్న తొలి  టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. స్పిన్నర్ల ధాటికి ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్‌ అయింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. భారత్ స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే చతికిలపడింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్‌ పటేల్‌ 84 పరుగులతో రాణించారు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 321/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరో 79 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులు చేసింది.

దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగుల ఆధిక్యం లభించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (120) శతకంతో మెరవగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(70), అక్షర్ పటేల్ (84) రాణించారు. చివరలో మహ్మద్ షమీ 37 పరుగులతో బ్యాట్ ఝులిపించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లు తీస్తే.. సారథి ప్యాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఒక వికెట్ పడగొట్టారు.

22 ఏళ్ల ఆస్ట్రేలియా స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ అరంగేట్ర టెస్ట్‌లోనే 7 వికెట్లతో అదరగొట్టాడు. భారత బ్యాటర్లను పూర్తి స్థాయిలో నిలువరించిన మర్ఫీ.. తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆటలో రాహుల్‌ను ఔట్ చేసి.. మొదటి అంతర్జాతీయ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండోరోజు కీలకమైన కోహ్లీతో పాటు నైట్‌ వాచ్‌మన్‌ అశ్విన్‌, పుజార, భరత్‌లను పెవిలియన్‌ చేర్చాడు.
 
ఈక్రమంలో అరంగేట్ర టెస్ట్‌‌లో ఐదు వికెట్లు తీసిన పిన్న వయస్సు ఆసీస్‌ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, షమీలను పెవిలియన్ చేర్చాడు. ఇలా అరంగేట్రంలోనే టీమిండియాపై ఏడు వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు.