ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దయ్యబట్టారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నిరాకరిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల సభ్యుల నినాదాల మధ్యే ప్రధాని రాజ్యసభలో మాట్లాడుతూ యూపీఏ పాలనను తాను నిశితంగా పరిశీలించానని, ఏ ఒక్క సమస్యకు వారు దీర్ఘకాలిక పరిష్కారం చూపలేదని, సమస్యలకు పైపూత పూశారని విమర్శించారు.
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘అభివృద్ధి చెందిన భారత దేశం’ దార్శనికతను పార్లమెంటుకు సమర్పించారని ప్రధాని కొనియాడారు. విపక్షాలనుద్దేశించి, మీరు బిజెపిపై ఎంతగా బురద జల్లితే…కమలం అంతగా వికసిస్తుంది పేర్కొన్నారు. కొందరి భాష, ప్రవర్తన భారత దేశానికి నిరాశ కలిగిస్తున్నాయిని తెలిపారు.
కొందరు తమ ప్రభుత్వం వివిధ పథకాలకు పెడుతున్న పేర్లు, సంస్కృత పాదాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయటాన్ని ప్రస్తావిస్తూ నెహ్రు నిజంగా అంత గొప్పవారైతే ఆయన కుటుంభానికి చెందిన వారు ఆయన పేరును తమ ఇంటి పేరుగా ఉంచుకోవడానికి ఎందుకు జంకుతున్నారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. సుమారు 600 ప్రభుత్వ పథకాలకు నెహ్రు-గాంధీ కుటుంబం పేర్లు ఉన్నట్లు తాను ఒక నివేదికలో చదివానని గుర్తు చేసుకున్నారు.
 
తనపైనా, తన ప్రభుత్వంపైనా ప్రతిపక్షాల ఆరోపణలను ప్రస్తావిస్తూ, వారి వద్ద (ప్రతిపక్షాల వద్ద) బురద ఉందని, తన వద్ద గులాల్ ఉందని, ఎవరి దగ్గర ఏది ఉంటే, దానినే వారు విసురుతారని వ్యాఖ్యానించారు ‘నేను ఈ ప్రతిపక్ష ఎంపీలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను…మీరెంత బురద(కీచడ్) జల్లితే..కమలం అంతలా వికసిస్తుంది’ అని స్పష్టం చేశారు. కొందరు ఎంపీలప ప్రవర్తన బాధ కలిగిస్తోందని చెప్పారు.
 
కాంగ్రెస్ పరిపాలించిన ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేసారు. ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాలను అందజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని, కానీ ఆ పార్టీ నేతల ప్రాధాన్యతలు, ఉద్దేశాలు వేరు అని తెలిపారు.
 
 దేశ ప్రజలను వంచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ దేశ ప్రగతి అవకాశాలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఖర్గే గారు చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని ఎద్దేవా చేశారు.
 
పార్టీ ఫస్ట్ అనేది కాంగ్రెస్ నినాదం అని పేర్కొన్నారు. గరీభ్ హఠావో అనేది కాంగ్రెస్ కు ఒక నినాదం మాత్రమేనని తెలిపారు. నాడు జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిందని ప్రధాని విమర్శించారు. కర్ణాటకలో 1.70 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండేవని, అవన్నీ మూతపడ్డాయని తెలిపారు. కానీ, ఎన్డీయే ప్రభుత్వం ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతోందని మోదీ స్పష్టం చేశారు. తాము పాలనతో ప్రజల మనసులు గెలుచుకున్నామని, రాజకీయాలతో కాదని చెప్పారు.
 
దేశంలో అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నామని, పార్టీ బలం పెంచుకోవడం తమ ధ్యేయం కాదని స్పష్టం చేశారు. దేశంలో 11 కోట్ల ఇళ్లకు తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. మహిళల కోసం 11 కోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తామని, వికాసాన్నే నమ్ముతాం తప్ప విపక్షాన్ని కాదని ఉద్ఘాటించారు.
 
విపక్షం ఆఖరికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ప్రధాని ధ్వజమెత్తారు. అయితే, మేకిన్ ఇండియా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బతికించిందని గుర్తు చేశారు. సామాన్యులను సాధికారులను చేయడం కోసం జన్ ధన్ ఖాతా ఉద్యమాన్ని ప్రారంభించామని ప్రధాని చెప్పారు. గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.