మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లకు జీవిత ఖైదు

మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లకు జీవిత ఖైదు
మైనర్లను వివాహం చేసుకొనే వాళ్లకు జీవితఖైదు తప్పకపోవచ్చని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మహెచ్చరించారు. మహిళలు సరైన వయస్సులో మాతృత్వాన్ని స్వీకరించాలని చెబుతూ లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అయితే, రాష్ట్రంలో 31 శాతం పెళ్లిళ్లు బాల్య వివాహాలేనని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
 
శనివారం గువాహటిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు, చిన్న వయసులో మాతృత్వాలను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. అమ్మాయిల బాల్య వివాహాలు, చిన్న వయస్సులోనే తల్లులు కాకుండా నిరోధించడానికి అస్సాం ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని భావిస్తోందని వెల్లడించారు.
 
‘‘14 ఏళ్ల లోపు అమ్మాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంటే నేరమే. వచ్చే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టు కానున్నారు. మైనర్ ను పెళ్లి చేసుకున్న వ్యక్తి అయినా సరే వదిలిపెట్టం’’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  చట్టపరంగా 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలు మాత్రమే పెళ్లి చేసుకునేందుకు అర్హులని పేర్కొంటూ మైనర్లను పెళ్లి చేసుకునే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బాలికలను పెళ్లి చేసుకునే వాళ్లకు జీవిత ఖైదు కూడా పడొచ్చని తేల్చి చెప్పారు. మహిళలు మాతృత్వాన్ని స్వీకరించడానికి 22 నుంచి 30 ఏళ్లు సరైన వయసని చెప్పారు. 30 దాటినా పెళ్లి చేసుకోని మహిళలు వెంటనే చేసుకోవాలని చమత్కరించారు. పెళ్లి ముందుగా చేసుకున్నా, ఆలస్యంగా చేసుకున్నా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.