ప్రగతి భవన్ ను ముట్దించిన బీజేపీ మోర్చాల నేతలు

స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. అనంతరం గోషా మహల్ కు తరలించారు. బీజేపీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రగతి భవన్కు కిలోమీటర్ దూరం వరకు పోలీసులను మోహరించారు. 

13 జిల్లాల్లో స్పౌజ్ టీచర్ల బదిలీలను బ్లాక్ చేయడంపై టీచర్లు ఆందోళనకు దిగారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు ముందే తమను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పని చేయడం వల్ల తమతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

అయితే మూడునాలుగు రోజులుగా టీచర్లు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడుతోంది. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.ప్రగతి భవన్ వద్ద మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషాసహా మోర్చా నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు.ప్రగతి భవన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ సహా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

కాగా, ఎస్సి మోర్చా నాయకులు, కార్యకర్తలు అరెస్టును మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఖండించారు. కులం పేరుతో దూషిస్తూ స్థానిక ఎస్సై మా నాయకులపై దాడి చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా తో సహా నాయకులను, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  నిరసన తెలపడం, ఆందోళన చేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి హక్కు అని స్పష్టం చేశారు.
 
కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని తక్షణమే సరిదిద్ది న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వందలాది అభ్యర్థులతో కలిసి వెళుతున్న బీజేపీ యువ మోర్చా నేతలను పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్దే అడ్డుకున్న పోలీసులు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ సహా పలువురు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
 
మహిళా టీచర్లు, చిన్న పిల్లలపై కేసీఆర్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు.