28 నుండి సంజయ్ పాదయాత్ర, 26 నుంచి ప్రజా గోస యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర మొదలుపెట్టనున్నారు.  అదే రోజున భైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభ నిర్వహించనున్నారు.

డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు సంజయ్ యాత్ర కొనసాగే అవకాశముంది. ఐదో విడతలో కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు.  కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా సంజయ్  ఇప్పటి వరకు 4 విడతలుగా పాదయాత్ర చేశారు. మొత్తం 21 జిల్లాల్లోని 13 లోక్ సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 

నాల్గో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం  నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆలస్యమైంది.

కాగా, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.

మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు.  ప్రతి అసెంబ్లీ  నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారు.