ఐసిస్ కరపత్రాలు, బాంబు తయారీ నోట్స్ తో ఓ వ్యక్తి అరెస్ట్

ఐసిస్ కరపత్రాలు, బాంబు తయారీ నోట్స్ తో ఓ వ్యక్తి అరెస్ట్
తమిళనాడు పోలీసులు  చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని నుండి ఇస్లామిక్  స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కరపత్రాలు, బాంబు తయారీ నోట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 వీరు ముగ్గురూ ఓ చెక్ పాయింట్ వద్ద తనిఖీలను తప్పించుకుని, పారిపోతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి, వారి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా గాలించి పట్టుకున్నారు. ఈ ముగ్గురిని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసు బృందంలో ఓ కానిస్టేబుల్‌ వారి వద్దనున్న బ్యాగును చేజిక్కించుకోగలిగారు.
దానిలో ఉన్నవాటిని పరిశీలించి చూసినపుడు, ఐసిస్ కరపత్రాలు, బాంబు తయారీ విధానం, అందుకు అవసరమైన రసాయనాలకు సంబంధించిన నోట్స్ కనిపించింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు.
బాంబు తయారీ గురించి యూట్యూబ్ ట్యుటోరియల్స్‌లో చూసి, ఈ నోట్స్‌ను రాసుకున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. అరెస్టయిన వ్యక్తి పేరు నాగూర్ మీరన్ అని, అతనిపై ఐపీసీ సెక్షన్లు 153ఏ (వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505(1)(బీ) (విద్వేషాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రచురణలు చేయడం), 505(2) (బహిరంగంగా మోసగించే ప్రకటనలు చేయడం) క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
ఈ వ్యక్తితోపాటు ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు అందుకున్న షకుల్ హమీద్ అనే ఐసిసి ఆపరేటివ్‌ను సెప్టెంబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చెన్నైలో అరెస్టు చేసిన విషయం కూడా ఇక్కడ గమనార్హం.