ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా… సీఎంకు కేరళ గవర్నర్ సవాల్

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా… సీఎంకు కేరళ గవర్నర్ సవాల్

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో తాను రాజకీయ జోక్యం చేసుకొంటున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల చేసిన ఆరోపణలను గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తోసిపుచ్చారు. ఆ విధంగా తాను జోక్యం చేసుకొన్న కనీసం ఒక్క సందర్భాన్ని చూపమని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి అటువంటి ఒక్క ఉదాహరణను చూపినా త తాను గవర్నర్‌ పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. లేనిపక్షంలో మీరు ఆ పని చేస్తారా..? అంటూ సీఎం పినరయికి గవర్నన్‌ బహిరంగంగా సవాల్‌ విసిరారు.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో తాను జోక్యం చేసుకొంటున్నట్లు ముఖ్యమంత్రి ఆరోపించడం  పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులను వీసీలుగా నియమించేందుకు గవర్నర్‌ ప్రయత్నిస్తున్నారని వారు పదే పడే ఆరోపిస్తున్నారు. ఆరఎస్ఎస్ వ్యక్తిని కాదు, మరే వ్యక్తినైనా కనీసం ఒక్కరిని నేను నా అధికారం ఉపయోగించి  నియమించినట్లు నిరూపిస్తే నేను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తాను’ అని వెల్లడించారు.

తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా అని సీఎం విజయన్‌కు గవర్నర్‌ ఈ సందర్భంగా సవాల్‌ విసిరారు. “నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సిపిఎం వారంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఉన్నత విద్య పరిస్థితి మెరుగు పడినట్లు చెబుతున్నారు. ఇదెలా సాధ్యం?” అని ఆయన ప్రశ్నించారు.  యూనివర్సిటీలలో  అర్హత లేని సిపిఎం నేతల బంధువులను నియమించడంతో సాధ్యం అవుతున్నదా? అని ఆయన ఎద్దేవా చేశారు.

మరోవంక, సీఎం విజయన్‌పై చర్య తీసుకుంటానని అంటూ గవర్నర్ రాజకీయ సంచలనం సృష్టించారు.  బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు.  కేరళ ప్రజలు ఇప్పుడు బంగారం స్మగ్లింగ్‌ గురించి, అందులో సీఎం కార్యాలయం పాత్ర మాట్లాడుకొంటున్నారని మీడియాకు చెప్పారు.

‘స్మగ్లింగ్‌ కార్యకలాపాలన్నీ సీఎంవో నుంచే జరిగినట్టు నాకు కనిపిస్తోంది. సీఎంవో, సీఎం సన్నిహితుల ప్రమేయం ఉంటే గనుక నేను తప్పక జోక్యం చేసుకుంటాను’ అని తెలిపారు. చట్ట ప్రకారం తాను చేయాల్సిందంతా చేస్తానని స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి కార్యాలయం స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు నేను చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, సిఎంఒ, సిఎంకు సన్నిహితులైన వ్యక్తులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడితే, నేను జోక్యం చేసుకోవలసి ఉంటుంది” అని గవర్నర్ తెలిపారు. 

“నేను జోక్యం చేసుకోవలసిన సమస్యలు ఉన్నాయి. నేను ఆయనపై (కేరళ సీఎం పినరయి విజయన్‌పై) ఎలాంటి ఆరోపణలు చేయడంలేదు. సీఎం కార్యదర్శిని తొలగించారు. సిఎంకు తెలియకుండా కేసులో ఉన్న వారిని ఆదుకుంటున్నారా? అప్పుడు, ఇది ముఖ్యమంత్రి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించారు .చట్ట ప్రకారం తాను చేయాల్సిందంతా చేస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.