
ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో చేరతానని తెలిపారు. ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం.. ఘర్ వాపసీ మాదిరిగా ఉందని పేర్కొంటూ పదవుల కోసం పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను కలవడం ఇప్పుడొక ఉద్యమంలా మారిందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ పేర్కొన్నారు.
భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఉందని చెబుతూ పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించిందని చెప్పుకొచ్చారు. ‘‘నా రాజకీయ జీవితం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నాను’’ అని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ నేతలు బూర నర్సయ్య ఇంటికెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని, బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని బండి సంజయ్ తెలిపారు. నర్సయ్య నిజాయితీపరుడని, ఒక ఆశయం కోసం బూర నర్సయ్య రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఉద్యమకారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కేసీఆర్ ను ఒక గ్రామానికి ఇంచార్జ్ గా వేసేలా చేసిన ఘనత బీజేపీదేనని చెబుతూ టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన టీఆర్‌ఎస్‌లో 2013 జూన్ 2న చేరి, 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందారు.
స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటì వ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సభ్యుడిగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.
ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (హిల్స్) కి డైరెక్టర్ గా ఉన్నారు. అంతేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నాడు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నారు. తెలంగాణలోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!