
ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీలో అధికార టిఆర్ఎస్ పార్టీ అవకతవకలకు పాల్పడిందని పేర్కొంటూ 25 వేల నకిలీ ఓటర్లను నమోదు చేసిందని భారత ఎన్నికల కమీషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఆ మేరకు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్, బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్, మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావు ఢిల్లీలో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు అందజేశారు. ఓటమి భయంతో టిఆర్ఎస్ నకిలీ ఓటర్లను చేరుస్తున్నారని పేర్కొంటూ ఓటర్ల జాబితాను పరిశీలించాలని వారు కోరారు.
గతంలో ఉప ఎన్నికల్లో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా ఎక్కడా నమోదు కాలేదని పేర్కొంటూ కానీ ఈ ఉప ఎన్నికల్లో భారీగా నకిలీ ఓటర్లను నమోదు చేశారని ఆరోపించారు. నకిలీ ఓటర్లను తొలగించాలని వారు ఎలక్షన్ కమీషన్ ను కోరారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోహరించి అక్కడ అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారని కూడా వారు తెలిపారు. గత నాలుగేళ్ల కాలంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నారని తెలుపుతూ అటువంటి వారిని బదిలీ చేయాలని కూడా వారు కోరారు.
మంత్రులు సెక్రెటరీలని తీసుకువచ్చి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, అధికారులను భయపెడుతున్నారని వారు పేర్కొన్నారు. తమ ఆరోపణలపై తప్పకుండా ఎన్నికల కమిషన్ విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర బలగాలను ,ఎన్నికల పరిశీలకులను మునుగోడు పంపాలని కేంద్రానికి సంఘాన్ని వారు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని తరలించారని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మునుగోడులోనే పెట్టారని వారు ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి, అవినీతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు అని తరుణ్ చుగ్ తెలిపారు. ఫలితాన్ని ప్రభావం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మూడేళ్లుగా ఒకే సెగ్మెంట్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలని కోరారు.
కాగా, ఏది ఏమైనా మునుగోడులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం సాధిస్తారని వారు భరోసా వ్యక్తం చేశారు.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం