గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున ఆయన భార్య ఉషాబాయి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు.తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తోటి ఖైదీల నుంచి తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో తన భర్తకు ప్రత్యేక వసతులకు అవకాశం కల్పించాలని ఆమె తన పిటిషన్ లో హైకోర్టును కోరారు. జైలులో ఇతర ఖైదీలకు దూరంగా తన భర్తకు ఓ గదిని కేటాయించాలని ఉషాబాయి హైకోర్టును కోరారు.
ప్రత్యేక గదితో పాటు అందులో మంచం, టేబుల్, కుర్చీ, వార్తా పత్రికలు, టీవీ, వంట చేసుకోవడానికి తగిన వసతులు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!