26 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా

26 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా
కరోనా తర్వాత అమెరికా, చైనా మధ్య విమాన రాకపోకల విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. అమెరికా ఎయిర్‌లైన్స్‌ లక్ష్యంగా చైనా ఆంక్షలు విధించడంతో గతేడాది ఆగస్టులో సైతం అమెరికా చైనాకు చెందిన ఎయిర్‌లైన్స్‌ను నాలుగుకే పరిమితం చేసింది. నాలుగు వారాల పాటు 40 శాతం కెపాసిటీతో నడపాలని ఆదేశించింది. 
 
కరోనాకు ముందు ఇరు దేశాల మధ్య వారానికి 100 సర్వీసులు నడిచేవి. రెండు దేశాల పరస్పర ఆంక్షల పుణ్యమా అని చైనాకు చెందిన 4, అమెరికాకు చెందిన 3 విమాన సంస్థలు ఇప్పుడు కేవలం వారానికి 20 విమానాలనే నడుపుతున్నాయి.

కాగా నాలుగు చైనా విమానయాన సంస్థలకు చెందిన 26 విమానాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. సెప్టెంబర్‌ 5 నుంచి సెప్టెంబర్‌ 28 మధ్య ఈ విమానాలు నడవాల్సి ఉంది. ఇటీవల కొవిడ్‌-19 కేసులను కారణంగా చూపి అమెరికా విమానయాన సంస్థలకు చెందిన విమానాలను చైనా రద్దు చేసింది.
 
 సరిగ్గా చైనా ఎన్ని విమానాలు రద్దు చేసిందో అన్నే విమానాలను అమెరికా తాజాగా రద్దు చేసింది. రద్దైన విమానాల్లో జియామెన్‌, ఎయిర్‌ చైనా, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు చెందిన విమానాలు ఉన్నాయి. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి బయల్దేరాల్సిన 19 విమానాలు, న్యూయార్క్‌ నుంచి బయల్దేరాల్సిన 7 విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. 
 
అమెరికాకు చెందిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను ఇటీవల చైనా రద్దు చేసింది. దానికి ప్రతిగా అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.