లద్దాఖ్ సరిహద్దు సమీపం నుంచి వెళ్లిన చైనీస్ యుద్ధ విమానం

లద్దాఖ్ సరిహద్దు సమీపం నుంచి వెళ్లిన చైనీస్ యుద్ధ విమానం
డ్రాగన్ దేశం చైనా మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే చర్యకు పాల్పడింది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత స్థావరాలకు అతి సమీపం నుంచి చైనా యుద్ధ విమానం ఒకటి ప్రయాణించింది. జూన్ చివరివారంలో జరిగిన ఈ ఘటనపై భారత వైమానిక దళం సత్వరమే  స్పందించింది. విషయాన్ని చైనా ఆర్మీ దృష్టికి తీసుకెళ్లింది.
ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని  ఆ ప్రాంత దళాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత వర్గాలు విషయాన్ని వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనా గగనతల ఉల్లంఘనలకు పాల్పడడం కొన్ని నెలల వ్యవధిలో ఇదే తొలిసారని అధికారులు చెప్పారు.
సరిహద్దులో మోహరించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్ చైనా విమానాన్ని గుర్తించింది. తూర్పు లద్దాఖ్‌లో తన నియంత్రణలోని ప్రదేశాల్లో చైనా కీలకమైన  సన్నాహాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ డ్రిల్స్‌లో ఎయిర్ డిఫెన్ ఆయుధాలను చైనా ఉపయోగించినట్టు సమాచారం.
కాగా గగనతల నిబంధనల ఉల్లంఘన జరగడంతో ఈ విషయాన్ని భారత వైమానిక దళం  అధికారులు చైనా ఆర్మీ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా సూచించినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. అప్పటి నుంచి సరిహద్దులో చైనా ఆ తరహా ఘటనలకు పాల్పడలేదని వెల్లడించింది. కాగా 2020 మాదిరిగా కఠిన పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఆ ప్రాంతంలో భారత దృఢమైన చర్యలు తీసుకుంది.