చొరబాటుకై ప్రయత్నిస్తున్న పాక్ ఉగ్రవాది కాల్చివేత 

చొరబాటుకై ప్రయత్నిస్తున్న పాక్ ఉగ్రవాది కాల్చివేత 

 అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి 3 రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ఉ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్  బలగాలు కాల్చిచంపాయి. జమ్ముకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది  ప్రయత్నించాడు. 

బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌ పోస్ట్) ఏరియాలో అర్ధరాత్రి 12.10 సమయంలో సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదిలికలను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. అక్కడే ఆగిపోవాలని, ముందుకు రావొద్దని ఉగ్రవాదిని బీఎస్ఎఫ్ అధికారులు హెచ్చరించారు. అయినా ఆలపించకుండా భారత్‌వైపు మరింత వేగంగా ఉగ్రవాది కదిలాడు. 

దీంతో చేసేదేమీ లేక బీఎస్‌ఎఫ్ బలగాలు 3 రౌండ్ల కాల్పులు జరిపాయి. సోమవారం ఉదయం వెళ్లి చూడగా సరిహద్దు కంచె పక్కనే ముష్కరుడి మృతదేహాన్ని గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అతడి వద్ద ఎలాంటి ఆయుధాలు లభించలేదు. కాగా తదుపరి దర్యాప్తు కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.

కాగా, భద్రతా బలగాలతో కలిసి ఒక ఉగ్రవాదిని సోమవారం అరెస్ట్ చేశామని దోడ పోలీసులు ప్రకటించారు. అరెస్టయిన ఉగ్రవాది పేరు ఫరీద్ అహ్మద్‌గా గుర్తించామని, ఇతడు కోటి దోడకు చెందినవాడని వెల్లడించారు.  ఈ ఉగ్రవాది నుంచి చైనీస్ పిస్తోల్, 2 మాగజైన్లు, 14 లైవ్ కార్ట్రీడ్జెస్‌, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

 కాగా అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో కాశ్మీర్‌లో భద్రతా చర్యలు పెరిగాయి. దోడ పోలీస్ స్టేషన్ పోలీస్ పార్టీ దోడ పట్టణ శివార్లలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. గస్తీలో భాగంగా ఆయుధాలు, అమ్మోనియంతో పయనిస్తున్న ఓ యువకుడు పట్టుబడ్డాడని పోలీసులు వివరించారు. 

నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోందని పోలీసులు వివరించారు. కాగా అమర్‌నాథ్ రథయాత్ర జూన్ 30న ప్రారంభమవనున్న విషయం తెలిసిందే.