
శ్రీరాంసాగర్ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్ గుడాటిపల్లి భూ నిర్వాసితులపై మరోసారి పోలీసు లాఠీ విరిగింది. హుస్నాబాద్ పట్టణం అట్టుడికింది. తమకు పరిహారం చెల్లించాలన్నందుకు పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ నిర్వాసితులు బంద్ పాటించగా, రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేయాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టడంతో ఇరు వర్గాల ఘర్షణ చోటుచేసుకుంది.
వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్ తలకూ గాయాలయ్యాయి. మొత్తంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరుస ఆందోళనలతో యుద్ధ వాతావరణం నెలకొంది.
తొలుత సోమవారం గుడాటిపల్లి నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బంద్ నిర్వహించారు. ఇందులో వందలాది మంది నిర్వాసితులు పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం నిర్వాసితులు తిరిగి ఇంటికి పయనమయ్యారు.
ఈ సమయంలో.. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి సాగు నీరివ్వాలసని ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఆర్డీవోకు వినతిపత్రం అందిస్తున్నామని, ఇందుకు అందుబాటులో ఉన్న కార్యకర్తలు, నాయకులు హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలంటూ సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ నాయకులు పోస్టు చేశారు.
దీనిని చూసిన నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించకుండా రిజర్వాయర్ పనులు ఎలా చేస్తారంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు తమ గోడు పట్టడంలేదంటూ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు హన్మకొండ-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు.
టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని, అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారించారు. అయినా.. వారు తోసుకుంటూ ర్యాలీ తీసేందుకు బయటకు వచ్చారు. దీంతో నిర్వాసితులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.
వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, ప్లాస్టిక్ పైపులతో లాఠీచార్జి జరిపారు. మరోవైపు ఆందోళనకారులు రాళ్లు, ఖాళీ బీరుసీసాలు, చెప్పులు విసిరారు. చాలా మంది నిర్వాసిత మహిళలు, యువకులు తోపులాటలో కిందపడిపోయారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏసీపీ సతీ్‌షకు తలకు గాయమైంది. పలువురు నిర్వాసిత యువకులను పోలీసుస్టేషన్‌కు బలవంతంగా లాక్కెళ్లారు. వీరిని మహిళలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో మహిళలూ తీవ్రంగా గాయపడ్డారు. నల్ల అనసూర్య, నోముల అనిత, కాలువల సుమలత, నోముల స్వరూప, భూక్య శ్రీనివాస్, కాలువల శేఖర్, ప్రవీణ్‌కు లాఠీలు, తోపులాటలతో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.
అకారణంగా తమపై లాఠీచార్జి జరిపారని నిర్వాసితులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయమంటే తమపైనే దాడులు చేస్తున్నారని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం.. మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు.
రాత్రి రాస్తారోకో నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. సిద్దిపేట సీపీ శ్వేత స్వయంగా వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
బండి సంజయ్ ఆగ్రహం
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు అడుగుతోంది న్యాయంగా పరిహారం ఇవ్వమంటే లాఠీలతో, పైపులతో పోలీసుల ద్వారా కొట్టిస్తవా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
గౌరవెల్లి భూ నిర్వాసితులపై సీఎం కేసీఆర్కర్కశంగా వ్యవహరిస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి మెప్పించాలి కానీ.. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని నిలదీశారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
ఆంగ్లేయుల గురించి ఏనాడూ భ్రమలు లేవు, రాజీ పడింది లేదు