బాలిక అత్యాచారంలో సీసీటీవీ పుటేజీ లేదనడం సిగ్గుచేటు 

బాలిక అత్యాచారంలో సీసీటీవీ పుటేజీ లేదనడం సిగ్గుచేటు 
ఓ 17 సంవత్సరాల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు మౌనం వహించడం, పైగా ఆ ప్రాంతంలో  సీసీటీవీ పుటేజీ లేదనడం సిగ్గుచేటు అని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు ధ్వజమెత్తారు. 
 
దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దల యత్నిస్తున్నారని ఆరోపించారు. అత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తి అయ్యేవరకు హోంమంత్రిని తొలగించాలని కోరారు. హోంమంత్రి మనవడి బ్యాచ్‌లర్‌ పార్టీ వల్లే రేప్ ఘటన జరిగిందని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పబ్‌లోకి మైనర్‌ను ఎలా అనుమతించారు? అని ప్రశ్నించారు. 
 
అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే వీఐపీ కల్చర్ ను ప్రమోట్ చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు. నిందితులను 24 గంటలలోపు అరెస్ట్ చేయకపోతే బీజేపీ న్యాయపోరాటం చేస్తుందని  రఘునందన్ రావు హెచ్చరించారు.  రాష్ట్రంలో ఉన్న సీసీటీవీలు ఏ రాష్ట్రంలో లేవని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని,  కానీ ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనపై ఎలాంటి సీసీటీవీ పుటేజీ లేదనడం కేవలం అసలు దోషులను కాపాడటం కోసమే అని ఆయన  స్పష్టం చేశారు. 
రూ. 12 వందల కోట్లతో పెట్టిన సీసీటీవీలు పని చేయలేదని డీజీపీ మహేదర్ రెడ్డి చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ నెంబర్ 1 అని చెప్పే సీఎం కేసీఆర్ ఒక ఆడబిడ్డను రక్షించలేక పోతున్నారని దయ్యబట్టారు.  సీసీటీవీలు ఎందుకు పనిచేయడం లేదో పోలీసులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కారు నెంబర్ ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.  ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కేసీఆర్  సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశంలో రామరాజ్యంగా పాలన జరుగుతుంటే, తెలంగాణలో దృతరాష్ట్ర పాలన సాగుతుందని విమర్శించారు.  తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు మైనర్ రేప్ కేసులో ఘటనలో ఎంఐఎం నాయకుల  కొడుకులు ఉన్నట్లు తెలుస్తోందని బిజెపి ఎమ్యెల్యే స్పష్టం చేశారు.
అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ బాధితురాలి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. పోలీసులు అనుకుంటున్నట్లున్నారు తాము సీసీటీవీ పుటేజీని తీసేశాం కదా, బీజేపీ వాళ్లకు ఈ నిజాలు ఎలా తెలుస్తున్నాయా అని చెబుతూ తమ  దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని రఘునందన్ రావు హెచ్చరించారు.
పోలీసులు మౌనమే పాటిస్తున్నారని, కనీసం సమాయానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు.  మైనర్ బాలికకు సంబంధించిన పూర్తి సీసీటీవీ పుటేజీ సీజ్ అయ్యిందా? కాలేదా? అనేదానిపై స్పష్టత కావాలని ఆయన డిమాండ్ చేశారు. తమ  దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ బాలిక కుటుంభం సభ్యులను బెదిరిస్తున్నారని, డోర్ లాక్ చేసి వారిని బయటకు పంపిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాని రఘునందన్ రావు ఆరోపించారు.
ఎక్కడా సీసీటీవీ పుటేజీని ఎడిట్ చేసినట్లు తెలిసినా .బీజేపీ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. గత నెల 28న ఘటన జరిగితే 31 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, జూన్ 2న బైటకు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే సాక్షత్తు ముఖ్యమంత్రి మాట్లడరు.. ట్విట్టర్ పక్షి కూయదు.. మహిళ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడరని అంటూ ఎద్దేవా చేశారు.