నిలిచిపోయిన రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు

నిలిచిపోయిన రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయని ఇరు దేశాలు తెలిపాయి. అయితే, ఈ ప్రతిష్టంభనకు మీరు కారణమంటే మీరు కారణమని ఇరు దేశాల ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటున్నాయి.

ఉక్రెయిన్‌ మొండిగా వ్యవహరిస్తూ, సంప్రదింపుల ప్రక్రియ నుంచి ఉపసంహరించుకోవడం వల్లే చర్చలు నిలిచిపోయాయని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో ఆరోపించారు. పశ్చిమ దేశాలు తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉక్రెయిన్‌ను ఉపయోగించుకోవాలని చూస్తునాుయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ చెప్పారు.

ఉక్రెయిన్‌లో తక్షణ పరిస్థితిపై కాకుండా పశ్చిమ దేశాల ఆందోళనలపై దృష్టి పెడితే శాంతి ఒప్పందం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.

అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు మైఖెల్‌ పోడోల్యాక్‌ మాట్లాడుతూ, రష్యా ఈ దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలు నెరవేరవని, ఈ విషయానిు క్రెమ్లిన్‌ అంగీకరించే స్థితిలో లేదని స్పష్టం చేశారు. ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరినా పెద్దగా తేడా ఏమీ ఉండదని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

రష్యా ఆధీనంలో మారియపోల్‌

మరోవంక, నెలల తరబడి బాంబు దాడులనంతరం ఓడరేవు నగరం మారియపోల్‌పై పట్టును రష్యాకు వదిలివేస్తూ ఉక్రెయిన్‌ బలగాలు అక్కడ నుండి వైదొలగాయి. మిగిలివున్న సైనికులందరినీ అక్కడ నుండి ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నామని ఉక్రెయిన్‌ మిలటరీ ప్రకటించింది.

రష్యా అధీనంలోని పట్టణాల్లో వందలాది మంది సైనికులు ఇంకా వున్నారు. వీరిలో చాలా మంది గాయపడ్డారు. వారిని కూడా ప్రస్తుతం తరలించారు. దీంతో సుదీర్ఘంగా, రక్తపాతంతో సాగిన ఉక్రెయిన్‌ యుద్ధం ఇక ముగిసినట్లు భావించే అవకాశాలు వున్నాయి. రష్యా దిగ్బంధం తర్వాత మరియుపోల్‌ పూర్తిగా శిధిలాల దిబ్బగా మారింది. ఈ నగరంలో వేలాదిమంది ప్రజలు మరణించారని ఉక్రెయిన్‌ పేర్కొంటోంది.

మరియుపోల్‌ నగరం పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని ఇంతకుముందే రష్యా ప్రకటించినప్పటికీ ఇంకా నగరంలో భూగర్భంలో వున్న అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో ఉక్రెయిన్‌ బలగాలు, ప్రజలు వందల సంఖ్యలో వున్నారు. ఇటీవల ప్రజలను తరలించిన ఆర్మీ తాజాగా సైనికులను కూడా తరలించే చర్యలు చేపట్టింది. దీంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్లాంట్‌ పూర్తిగా రష్యా బలగాల అధీనంలోకి వచ్చింది.

పోలాండ్‌ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ నగరమైన లివివ్‌లో, కీవ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకాక రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున కూడా లివివ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఎవరూ మరణించినట్లు వార్తలందలేదు.

కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధానికి గానూ రష్యా తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటోంది. రష్యాను వీడిన అతిపెద్ద అంతర్జాతీయ బ్రాండ్లలో మెక్‌డొనాల్డ్‌ ఒకటి. గత 30 ఏళ్ల నుండి ఆ దేశంలో నడుపుతున్న రెస్టారెంట్లన్నింటినీ మూసేసి, విక్రయించాలని చూస్తోంది.

ఫిన్లాండ్‌, స్వీడన్‌లు నాటోలో చేరినా ప్రస్తుతానికి రష్యాకు వచ్చిన తక్షణ ముప్పేమీ లేదని, పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో నాటో విస్తరణ పట్ల పుతిన్‌ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు కూడా ఈ నాటో విస్తరణనే ఒక కారణంగా చూపిన పుతిన్‌ ప్రస్తుతం ఈ రెండు దేశాలు చేరినా తమకు ముప్పు లేదని భావిస్తుండటం గమనార్హం.