కేంద్రమే ఆర్డీఎస్ ను ఆధునీకరిస్తుంది

కేంద్రమే ఆర్డీఎస్ ను ఆధునీకరిస్తుంది
ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎనిమిదో రోజైన గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నడిగడ్డను సస్యశ్యామలం చేసే ఆర్డీఎ్‌సను ఆరునెలల్లో పూర్తిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. 
కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్‌ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నాయని, కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఆర్డీఎస్‌ పూర్తికి సహకరించాలని సంజయ్ కోరారు. ఆర్డీఎస్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి 87,500 ఎకరాల సాగు నీరందించవచ్చని క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నివేదిక మార్చ్ 9న ఇచ్చిందని తెలిపారు.
ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న మాజీ మంత్రి  డీకే అరుణమ్మను నేటి నుంచి ఆర్డీఎస్ అరుణమ్మగా పిలచుకోవాలని సంజయ్ సూచించారు. తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన వాటాను అందించేందుకు ఆర్డీఎస్ మెయిన్ కెనాల్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నీళ్లందించేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్ లో మార్పులు చేస్తోందని ఆయన చెప్పారు. 

కాలువలోని సీపేజ్, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్దరణ పనులు చేపట్టబోతోందని వెల్లడించారు. కేఆర్ఎంబీ వల్లే ఈ మూడు రాష్ట్రాల సమస్యను సులువుగా పరిష్కరించి ఆర్డీఎస్ ద్వారా మనకు రావాల్సిన ప్రతి నీటి చుక్క రాబోతోందని తెలిపారు. 
 
ఆర్డీఎస్ విషయంలో 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ ఏడవటం తప్ప కేసీఆర్ సాధించేమిటని సంజయ్  ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా రూ 3 లక్షల కోట్లకు  నిధులు తెలంగాణకు కేటాయించిందని స్పష్టం చేశారు.
తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదనిమంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను  పరోక్షంగా ప్రస్తావిస్తూ లెక్కలు రాకుంటే తెలుసుకో, ఇచ్చిన నిధులెన్నో లెక్కలు చూసుకో అంటూ ఎద్దేవా చేశారు. 2021 వరకు పన్నుల వాటా కింద రూ.1.68 లక్షల కోట్ల నిధులతో పాటు ఇతర పథకాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందిని సంజయ్ వెల్లడించారు. 
 
గద్వాల్ లో 300 పడకల ఆసుపత్రి కట్టిస్తనని సీఎం చెప్పి మూడేళ్లయినా  అతీగతీ లేదని సంజయ్ విమర్శించారు. రోగమొస్తే పక్క రాష్ట్రం పోయి అక్కడి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నరని, కానీ  ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి లేదని ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నా కేసీఆర్ సర్కారుకు చలనం లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఇంటికో ఉద్యోగమిస్తమన్న ముఖ్యమంత్రి 317 జీవో సవరణ కోసం ఉద్యోగుల తరఫున బిజెపి కొట్లాడితే తమను జైలుకు పంపిన్రు  అని, బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని  ఆగ్రహం వ్యక్తం చేసారు.  సమయానికి జీతాలివ్వకుండా ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేధిస్తున్నడు అంటూ ఉద్యోగుల కోసం దీక్ష చేస్తే తనను  కూడా జైల్లో పెట్టిండ్రు అని గుర్తు చేశారు.

పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలుకు పోయిన సిబ్బందిపై మైనారిటీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నరని సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఎంఐఎం దాడిలో గాయపడ్డారో, ఆ సిబ్బందికి అదే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చి దాడులకు తెగబడ్డ వారికి బుద్ది చెబుతాం అని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే కన్పిస్తున్నాయని పేర్కొంటూ  మొన్న ఖమ్మంలో సాయి గణేష్ స్థానిక మంత్రి అక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తుంటే అతనిపై 16 కేసులు బనాయించి రౌడీ షీట్ చేస్తామని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిండు అని మండిపడ్డారు.  సాయి ఆత్మహత్యకు కారణమైన  ఆ మంత్రి అక్రమాలు, ఆగడాల చిట్టా బీజేపీ దగ్గరుందని చెబుతూ  బీజేపీ అధికారంలోకి రాగానే సాయి ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.