
ట్విట్టర్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అరెస్టయ్యారు. ఈ కేసు విచారణ కోసం గుజరాత్ లోని పాలంపూర్ సర్క్యూట్ హౌస్ లో బుధవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మేవానీ ఈ నెల 18న ఓ ట్వీట్ చేశారు. వివాదాస్పదంగా ఉన్న ఆ ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. అయితే ఈ ట్వీట్ ఆధారంగా మేవానీపై చర్యలు తీసుకోవాలంటూ అస్సాంలోని కోక్రాఝర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త అరూప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగానే మేవానీని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మేవానీ అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పే గొంతుకను అణచివేయలేరని ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
కాగా, రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్ గా ఉన్న జిగ్నేశ్ మేవానీ గత ఎన్నికల్లో గుజరాత్ లోని వడ్ గాం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు గతేడాది ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే చేరాలని తొలుత భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల చేరలేకపోతున్నట్లు వెల్లడించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’