
పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం వర్సిటీ క్యాంపస్‌లో ఫోన్లను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈ వివరాలను సామా టివి ఛానల్ ఓ కథనంలో వెల్లడించింది.
తెహ్రిక్ తాలిబన్ మిలిటెంట్లు క్రియాశీలంగా ఉండే ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలోని ఉమెన్ యూనివర్సిటీ స్వాబి యాజమాన్యం కఠిన ఆంక్షలు విధించింది. క్యాంపస్ పరిసరాల్లోకి స్మార్ట్‌ఫోన్లు, టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్‌లను అనుమతించబోమని విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20 నుంచే (బుధవారం) అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.
యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థినులు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నట్లు గమనించి ఈ ఆదేశాలను జారీ చేసినట్టు విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో విద్యార్థినుల డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్ వంటి వాటిపై తరచూ కఠిన ఆంక్షలు అమలుచేస్తుంటారు. అమ్మాయిలంతా సల్వార్ కమీజ్ ధరించాలని నిబంధనలు పెడుతుంటారు. గతేడాది మార్చిలో పెషావర్ యూనివర్సిటీ కొత్త డ్రెస్ కోడ్‌ను పాటించాలని ఆదేశించింది.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన