ముస్లింల రాజకీయాలు మతపరమైనవే… అంబేద్కర్ స్పష్టం

ముస్లింల రాజకీయాలు మతపరమైనవే… అంబేద్కర్ స్పష్టం
* 131వ జయంతి నివాళి 
 
ముస్లిం రాజకీయాలపై,  ఇస్లాం గురించి డా. బి ఆర్  అంబేద్కర్ ఆలోచనలను పరిశీలిస్తే, ముస్లింలతో షెడ్యూల్డ్ కులాలు రాజకీయంగా సఖ్యతతో వ్యవహరించడంకు ఆయన ఎప్పుడూ అనుకూలంగా లేరని స్పష్టంగా తెలుస్తుంది. అంబేద్కర్ గ్రంధం ‘పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన’లోని 10వ అధ్యాయం ఈ అంశాన్ని నిర్ద్వంద్వంగా స్పష్టం చేస్తుంది. 
 
“హిందువులు, ముస్లింలు నిరంతరం పొదలాడుకొంటూ ఉండాలని ముస్లింలు కోరుకొంటాస్తారు; హిందువులు ముస్లింలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడానికి  ప్రయత్నం చేస్తుంటే,  ముస్లింలు పాలకులుగా దేశంలో తమ చారిత్రక స్థానాన్ని తిరిగి పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటారు.  ఈ పోరాటంలో బలవంతులు మాత్రమే గెలుస్తారనే నమ్మకంతో తమబలాన్ని నిర్ధారించుకోవడానికి వారు తమ శ్రేణులలో విభేదాలకు కారణమయ్యే ప్రతి అంశాన్ని అణచి వేయడమే  లేదా కోల్డ్ స్టోరేజీలో ఉంచడమో చేస్తుంటారు” అని తెలిపారు.
 
పైగా,  ఇతర దేశాల్లోని ముస్లింలు తమ సమాజాన్ని సంస్కరించే కృషి చేస్తుండగా, భారతదేశంలోని  ముస్లింలు మాత్రం అలా చేయడానికి నిరాకరిస్తున్నారు.  అందుకు కారణం ఇతర దేశాలలోని వారు  ప్రత్యర్థి వర్గాలతో మతపరమైన, రాజకీయ ఘర్షణల నుండి విముక్తి పొందగా, మనదేశంలోని వారు పొందకపోవడమే కారణం అని కూడా ఆయన పేర్కొన్నారు. 
ముస్లిం రాజకీయ నాయకులు, మత పెద్దలపై, వారి మతంలో సంస్కరణలు లేకపోవడంపై తీవ్రంగా దాడి చేస్తూ, అంబేద్కర్ ఇంకా ఇలా చెప్పారు: “ముస్లింల విషయంలో, ఎన్నికలు కేవలం డబ్బుకు సంబంధించిన అంశం మాత్రమే.  చాలా అరుదుగా వారు సాధారణ అభివృద్ధికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముస్లిం రాజకీయాలు పూర్తిగా లౌకిక జీవన అంశాలైన ధనిక-పేద, మూలధనం- కార్మికులు, భూస్వామి- కౌలుదారు, పూజారి- సామాన్యుల వంటి అంశాలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు.”

“ముస్లిం రాజకీయాలు తప్పనిసరిగా మతపరమైనవి. హిందువులు, ముస్లింల మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని మాత్రమే గుర్తిస్తాయి. ముస్లిం సమాజంలోని రాజకీయాలలో లౌకిక వర్గాలలో ఎవరికీ స్థానం లేదు.   వారికి చోటు దొరికితే- అవి అణచివేయలేనివి కాబట్టి. ముస్లిం రాజకీయ విశ్వం ఏకైక పాలక సూత్రానికి లోబడి ఉంటాయి. అది మతం.”

“ముస్లింలలో ఈ దుర్మార్గాల ఉనికి చాలా బాధ కలిగిస్తుంది. కానీ మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే, భారతదేశంలోని ముసల్మాన్‌లలో అటువంటి దురాచారాల నిర్మూలనకు తగిన స్థాయిలో సంస్కరణలకై  వ్యవస్థీకృత ఉద్యమం లేదు. హిందువులలో  సామాజిక దురాచారాలు ఉన్నాయి. అయితే వారిలో  కొందరు వాటి గురించి స్పృహతో ఉన్నారు.  వారిలో కొందరు వాటి  తొలగింపు కోసం చురుకుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు, ముస్లింలు అవి దుర్మార్గమైనవని గుర్తించరు.  తత్ఫలితంగా వాటి  తొలగింపు కోసం ఉద్యమించరు. నిజానికి, వారు తమ ప్రస్తుత పద్ధతుల్లో ఏదైనా మార్పును వ్యతిరేకిస్తారు”.

ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ చేసిన  అనేక ప్రకటనలు,  రచనల దృష్ట్యా, దళిత-ముస్లిం కలయికను ఏర్పరచడానికి ప్రయత్నించే ఏ నాయకుడైనా లేదా పార్టీ అయినా అంబేద్కర్ వారసత్వానికి ద్రోహం చేసినట్లే అని గుర్తించాలి. 

కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, అది మొదట డాక్టర్ అంబేద్కర్‌ను అవమానపరిచి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసేటట్లు చేసింది.  ఆపై 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి, మరియు 1954 ఉప ఎన్నికలలో భండారా నుండి ఆయన ఓడిపోయేటట్లు చేసింది.  దేశంలోని షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తున్నదని అంబేద్కర్ పార్లమెంటులో చేసిన రాజీనామా ప్రసంగం ఈ అంశాన్ని స్పష్టం చేస్తుంది.
సెప్టెంబరు 27, 1951న నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటులో అంబేద్కర్ ఈ విషంగా చెప్పారు: (అంబేద్కర్ రచనలు, వాల్యూం. 14, పార్ట్ టూ, పేజీలు.1317-1327) , “… షెడ్యూల్డ్ కులాలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు? ముస్లింల రక్షణపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధతో పోల్చండి. ముస్లింల రక్షణ కోసం ప్రధాని మొత్తం సమయం, శ్రద్ధను వెచ్చించారు. … నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే, రక్షణ అవసరం ముస్లింలకు మాత్రమేనా? షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, భారతీయ క్రైస్తవులకు రక్షణ అవసరం లేదా? ఈ సంఘాల పట్ల ఆయన చూపిన శ్రద్ధ ఏమిటి? నాకు తెలిసినంత వరకు, వీరి కోసం ఏమీ చేయడం లేదు. నా దృష్టిలో ముస్లింల కంటే వీరి పట్ల ఎక్కువ  శ్రద్ధ చూపించవలసి ఉంది”.
 
నెహ్రు అవమానించారు 

తన ప్రసంగంలో నెహ్రూతో కలిసి మంత్రివర్గంలో పనిచేసినప్పుడు తాను అనుభవించిన అవమానాన్ని కూడా వివరించారు: “…….. పాత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో, నేను రెండు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించాను. అవి కార్మికులు, సిపిడబ్ల్యుడి.  అక్కడ నేను చాలా ప్రణాళికా ప్రాజెక్ట్‌లను డీల్ చేసాను. 
కొంత అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాలనుకుంటున్నాను. ప్రధాని అంగీకరించి, చట్టంతో పాటు ప్రణాళికా శాఖను కూడా నాకు ఇస్తానని చెప్పారు.  దానిని రూపొందించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తూ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ చాలా ఆలస్యంగా వచ్చింది.  అది వచ్చినప్పుడు, నేను దూరంగా ఉన్నాను.

నా హయాంలో ఒక మంత్రి నుంచి మరో మంత్రికి అనేక శాఖల బదిలీలు జరిగాయి. వాటిలో దేనికైనా నన్ను పరిగణించవచ్చని నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోకుండా వదిలేశారు”. 
 
“చాలా మంది మంత్రులకు రెండు, మూడు శాఖలు ఇవ్వడంతో వారిపై భారం పడింది. నాలాంటి వారు మరింత పని చేయాలని కోరుకున్నారు.  మంత్రులు కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లినప్పుడు తాత్కాలికంగా పోర్ట్‌ఫోలియోను నిర్వహించేందుకు ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా నన్ను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రుల మధ్య ప్రభుత్వ పని పంపిణీలో ప్రధాన మంత్రి అనుసరించే సూత్రం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం” అంటూ విమర్శించారు.

“ఇది సామర్థ్యమా? ఇది నమ్మకమా? ఇది స్నేహమా? నన్ను ఏ ప్రధాన నియమించలేదు.  ఆర్ధిక శాస్త్రం చదివిన నన్ను ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీలో సభ్యునిగా కూడా నియమించలేదు.   నేను విదేశీ వ్యవహారాల కమిటీ, లేదా రక్షణ కమిటీల గురించి మరచిపోయాను. ఆర్ధిక వ్యవహారాల కమిటీ ఏర్పాటైనప్పుడు, నన్ను ప్రాథమికంగా ఏ కమిటీలో నియమించనందున ఆ కమిటీలో నియమిస్తారని ఆశించాను.  ప్రధానమంత్రి ఇంగ్లండ్‌ వెళ్లినప్పుడు మంత్రివర్గం నన్ను ఈ కమిటీలో నియమించింది. కానీ ఆయన తిరిగి రాగానే, మంత్రివర్గం పునర్నిర్మాణంకై చేపట్టిన అనేక చర్యలలో ఆయన నన్ను విడిచిపెట్టారు. తదుపరి పునర్నిర్మాణంలో నా పేరు కమిటీకి చేర్చినా, అది నా నిరసన ఫలితంగా జరిగింది”.అంటూ వివరించారు.