
ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.
రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే ఇందుకోసం కష్టించి పనిచేయడంతో పాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఇతరులు చెప్పే అంశాలను ఓపికగా వినడం కూడా నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనదని చెబుతూ చిన్న చిన్న సంతోషాలను పక్కనపెట్టి పరిస్థితులను, పెద్దల అనుభవాలను అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని కూడా వెంకయ్యనాయుడు చెప్పారు.
ఇందుకోసం వ్యాయాయం చేయాలని, యోగాను దైనందిన జీవితంలో ఓ భాగం చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సంతులనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు తలెత్తుతున్నాయని, అయితే మన సంప్రదాయ ఆహార పద్ధతులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ సందర్భంగా తన బాల్య స్మృతులను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. తనకు కబడ్డీ, ఖో-ఖో అంటే ఇష్టమని ఇప్పుడు నిత్యం బ్యాడ్మింటన్ ఆడుతున్నానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అసెంబ్లీకి నిత్యం హాజరవుతూ ప్రతి సభ్యుడి ప్రసంగాన్ని వినేవారిమని పేర్కొన్నారు. అనంతరం లైబ్రరీలో ప్రముఖుల ప్రసంగాలను చదివే విషయాన్నీ ఉపరాష్ట్రపతి తెలుగు విద్యార్థులతో పంచుకున్నారు.
అనవసర ఖర్చులు చేయకుండా పొదుపుగా ఉండాల్సిన అవసరాన్నీ ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించగారు. పెద్దల పట్ల గౌరవ భావాలను ప్రదర్శిస్తూ వారి అనుభవాల ద్వారా నేర్చుకునే సారాన్ని తమ జీవితానికి వర్తింపజేసుకోవాలని వెంకయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అక్షత్ దహియాతో పాటు పలువురు తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు