
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి బుధవారంనాడు సమాధానమిస్తూ ఉక్రెయిన్ సిటీ బుచాలో పౌరులను ఊచకోత కోస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్‌ను తీవ్రంగా కలిచివేస్తున్నట్టు చెప్పారు.
”రక్తపాతం, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం కనుగొనలేం. నేటియుగం, ఇవాల్టి పరిస్థితుల్లో చర్యలు, దౌత్యం వల్లే ఎలాంటి సమస్యకైనా సరైన సమాధానం దొరుకుతుంది” అని జైశంకర్ తెలిపారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు.
భారత్ ను ఏదో ఒక మార్గం ఎంచుకోమని అంటే భారత్ శాంతి మార్గం వైపే ఉంటుందని, హింసకు తక్షణం ముగింపు పలకాలంటే ఇదే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యస సమితితో సహా అన్ని అంతర్జాతీయ వేదకలు, చర్చల్లో భారత్ ఇదే వైఖరిని పదేపదే చెబుతూ వస్తోందని సభకు తెలిపారు.
అంతర్జాతీయ చట్టాలను, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలనే భావన అందరిలోనూ ఉండాలని సూచించారు. ఉక్రెయిన్‌ని బుచా సిటీలో పౌరల ఊచకోత ఘటనలను తాము ఖండిస్తున్నామని, ఇది చాలా తీవ్రమైన అంశమైనందున, దీనిపై స్వంతంత్ర విచారణకు తాము మద్దతిస్తామని జైశంకర్ చెప్పారు.
దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నామని జైశంకర్ సభలో వెల్లడించారు. యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసి అందుకు తగిన చర్యలు చేపట్టినట్టు వివరించారు. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న ఈ సమయంలో భారత్ లోని సామాన్యులపై భారం పడకుండా ప్రయత్నిస్తున్నామని జయశంకర్ తెలిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు