మోదీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్

మోదీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్యచేస్తామని బెదిరిస్తూ ముంబైలోని  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయంకు ఒక అగంతకుడి నించి మెయిల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ అప్రమత్తమైంది. వేలాది మందిని హత్య చేసేందుకు తన వద్ద 20 కిలోల ఆర్‌డీఎక్స్ కూడా ఉన్నట్టు అగంతకుడు ఆ మెయిల్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ పని నిర్వహించేందుకు, దేశంలో అత్యంత విషాద ఘటనను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులతో తాను టచ్‌లో ఉన్నానని, దేశవ్యాప్తంగా ఉన్న స్లీపర్ సెల్స్‌ను తాను ఫిబ్రవరి 28న యాక్టివేట్ చేసినట్టు అజ్ఞాత వ్యక్తి తెలిపాడు. ప్రధాని హత్య కోసం 20 మంది స్లీపర్ సెల్స్ ఫిబ్రవరి 28 నుంచి రెడీగా ఉన్నారని, 20 కేజీల ఆర్డీఎక్స్ను కూడా సిద్ధం చేసినట్లు అందులో పేర్కొన్నారు.
 
ప్రధానితో పాటు వేలాది మందిని హతమారుస్తామని, ఇందుకోసం దేశవ్యాప్తంగా 20 చోట్ల దాడులకు ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని నాశనం చేశాడని మెయిల్ పంపిన వ్యక్తి ఆరోపించాడు. పలు టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లు కుట్రలో పాలుపంచుకుంటున్నట్లు అందులోని వివరాలను బట్టి తెలుస్తోంది. 
 
బెదిరింపు మెయిల్పై కేంద్ర హోం శాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వివరాలను పలు ఏజెన్సీలకు పంపి ఐపీ అడ్రన్తో పాటు మెయిల్ను ఎవరు పంపారు? ఎక్కడి నుంచి పంపారు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. 
 
ప్రధానమంత్రి మోదీని చంపుతామని బెదరిస్తూ ఎన్ఐఏకు మెయిల్ రావడం ఇది మొదటిసారి కాదు. 2018లోనూ పుణె పోలీసులకు వచ్చిన ఒక లేఖలో రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నామనే సమాచారం ఉంది. 1991 మే 21 శ్రీపెరంబుదూరులో శ్రీలంకకు చెందిన ఆత్మహుతి బాంబర్ జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ  హత్యకు గురయ్యారు.