కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో మధ్యాహ్నభోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా.. వారిలో కొంత మంది వెంటనే వాంతులు చేసుకున్నారు.
స్థానికులు , తల్లిదండ్రులు గుర్తించి విద్యార్థులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందించారని తెలిపారు.
విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. పాడైన గుడ్లు వడ్డించడంవల్లే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెల్లడించారు.
కాగా, ”వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారు. మధ్యాహ్న భోజనంలో సాంబారు, గుడ్డు తిన్నామని చెప్పారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్యం అందించాం. చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్ఛార్జ్ చేస్తాం” అని సూపరింటెండెంట్ తెలిపారు.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్