
కాంగ్రెస్ చివరి కంచుకోట అయిన పంజాబ్‌లో అధికారం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం సుమారు పదేళ్ళపాటు పార్టీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ ప్రస్తావన తీసుకువచ్చేందుకు భయపడుతున్నది.
ఒక వైపున బీజేపీ కూటమి, మరో వైపున ఆప్ అధికారం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ నాయకత్వం విషయమై ఒక విధంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ కు ప్రధానంగా ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాహుల్, ప్రియాంకలు కేవలం అమరీందర్‌ని మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 21 వరకు ఉన్న కాంగ్రెస్ హయాంలో జరిగిన పాలనా విధానాలను కూడా తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ తర్వాత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చిరంజీత్ సింగ్ చిన్నీ మాత్రమే నాలుగున్నరేళ్లుగా అమరీందర్ చేయలేని ఎన్నో పనులను ప్రజల కోసం చేస్తున్నారని అంటూ ప్రచారం చేస్తున్నారు.
అమరీందర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు తొలిదకాలిచ్చి, కేంద్రంలో బిజెపి చెప్పిన్నట్లు పాలన చేస్తున్నారని, అందుకనే ఆయనను పదవినుండి తొలగించవలసి వచ్చిందని కూడా చెబుతున్నారు. ఈ నెల 13న సంగూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మొదటిసారిగా ప్రియాంకగాంధీ అమరీందర్ సింగ్ గురించి మాట్లాడారు.
అమరీందర్ సింగ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మోదీ ఆదేశాల మేరకు పనిచేసిందని ఆమె ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వమార్పులు జరిగాయని .. ఇక నుండి రాష్ట్ర పాలన పంజాబ్ నుండే జరుగుతుందని, ఢిల్లీ నుండి కాదని ఆమె పేర్కొన్నారు. మీలో ఒకరైన చరణ్‌జీత్ సింగ్ చన్నిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించామని, ఆయనకు ప్రజల సమస్యలు తెలుసునని ఆమె చెప్పారు.
రెండు రోజుల అనంతరం పటియాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ కూడా ఇంచుమించు ఇవే వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ సింగ్‌కి బిజెపితో సంబంధాలు ఉన్నాయని తెలియగానే ఆయనను కాంగ్రెస్ అధిష్టానం తొలగించిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ విధానాలను రాష్ట్రంలో అమలు చేయడాన్ని అమరీందర్ సింగ్ తిరస్కరించారని రాహుల్ ఆరోపించారు.
పంజాబ్‌లో తలెత్తిన విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తాను చెప్పానని, అయితే ఆ సంస్థలతో ఒప్పందాలు జరిగాయని చెప్పారని తెలిపారు. ఒప్పందం పేరుతో ప్రజలను పట్టించుకోరా అని సూటిగా ప్రశ్నించానని చెప్పారు. అమరీందర్ రాజీనామా అనంతరం సిఎంగా బాధ్యతలు చేపట్టిన చన్ని కాంగ్రెస్ ఆదేశాల మేరకు విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించారని చెప్పారు.
మరోవైపు అమరీందర్ సింగ్ కూడా అదేస్థాయిలో కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. ఈ వారం ప్రారంభంలో మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం తనకు సంకెళ్లు వేసిందని ఆరోపించారు.
గతంలో తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యానని, 40 మంది అవినీతి నేతల జాబితాను ఆమె దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించాయిరు. అయితే సోనియా స్పందించలేదని.. వారిపై చర్యలు తీసుకుని ఉంటే తాను మరో పార్టీని ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదని స్పష్టం చేశారు.
దీంతో అమరీందర్, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తిరస్కరించడం ద్వారా పార్టీ చివరి కంచుకోటగా భావించే పంజాబ్ ఓటర్ల ఆగ్రహం నుండి కాంగ్రెస్‌ను రక్షించుకునేందుకు రాహుల్, ప్రియాంకలు శతవిధాలుగా యత్నిస్తున్నారు. అలాగే అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్, బిజెపి, మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌దేవ్ సింగ్ దహిండ్సా నేతృత్వంలోని ఎస్‌ఎడి (సంయుక్త్) కూటమి నుండి కాంగ్రెస్ ఓట్లు చీలకుండా రక్షించుకునేందుకు వీరిద్దరూ యత్నిస్తున్నారు.
మొదటి దళిత సిఎం చన్నీ యే నంటూ ఓటర్లకు సందేశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా చన్నితో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.అమరీందర్ దిగిపోతే తానే ముఖ్యమంత్రి కాగలనని ధీమాతో ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ కనీసం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించదాకా పోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు.
పంజాబ్ లో కాంగ్రెస్ కు ప్రజాకర్షణ గల ఏకైక నాయకుడైన సిద్దూ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కనిపించడం లేదు. పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చన్నీకి పార్టీలో పెద్దగా మద్దతు లేదని బాహాటంగానే చెబుతున్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము