యూపీలో రైతులకు రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు

యూపీలో రైతులకు రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ప్రకటించారు. దిబియాపూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ  మార్చి 18న హోళీ పండుగ జరుగుతుందని, ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని చెప్పారు.
 ‘‘మార్చి 10న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మార్చి 18న మీ ఇళ్ళకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయి’’ అని హామీ ఇచ్చారు.   రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి, రెండో విడత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోయిందని జోస్యం చెప్పారు.  బీజేపీకి 300కు పైగా స్థానాలు లభించడానికి పశ్చిమ ఉత్తర ప్రదేశ్ పునాది వేసిందని భరోసా వ్యక్తం చేశారు. మూడో విడత పోలింగ్‌లో ఈ ఆధిక్యత మరింత ఘనంగా ఉంటుందని చెప్పారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌ను బీజేపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడాన్ని  అమిత్‌షా తిప్పికొట్టారు. పసుపుపచ్చ కళ్లదాలతో చూసే వాళ్లకి ప్రతీదీ ఆ రంగులోనే కనిపిస్తుందని ఛలోక్తులు విసిరారు.  అఖిలేష్ ప్రభుత్వం తుపాకులు, తూటాలు తయారుచేసేదని ఆరోపియఞ్చారు. ఇప్పుడు తూటాలకు (గోలీ) బదులు లక్ష్యం (గోల్) సిద్ధం చేసుకున్నామని, పాక్‌కు కాల్పులతోనే దీటుగా సమాధానమిస్తున్నామని చెప్పారు.