గల్ఫ్ జైళ్లలో 4,060 మంది భారతీయులు

గల్ఫ్ జైళ్లలో 4,060 మంది భారతీయులు
గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న భారతీయుల వివ రాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్రరాల సమయంలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గల్ఫ్ జైళ్లలో ఉన్న ట్రయల్ ఖైదీలతో పాటు శిక్ష ఖరారైన ఖైదీలు 4,060 మంది ఉన్నారని వెల్లడించారు.
దుబాయ్ లో 1,663 మంది, సౌదీ అరేబియాలో 1,363 మంది, ఖతార్ లో 466 మంది, కువైట్ లో 460 మంది, బహ్రెయిన్ లో 63 మంది, ఒమన్ లో 45 మంది జైళ్లలో ఉన్నారని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల సేఫ్టీ, సెక్యూరిటీ, సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా చూస్తుందని కేంద్ర మంత్రి మురళీధరన్ చెప్పారు.
విదేశీ జైళ్లలో ఉన్న వారి సంరక్షణ బాధ్యతను ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. దౌత్య పరంగా, న్యాయపరంగా ఎప్పటికప్పుడు సహాయం అందిస్తున్నాయని చెప్పారు. ఏ దేశంలోనైనా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటే అక్కడ స్థానిక న్యాయవాదులను  ఇండియన్ కమిషన్ నియమిస్తుందని తెలిపారు.