అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం సంగతేంటి?

అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం సంగతేంటి?
2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేస్తూ, ఆ విగ్రహం సంగతేమిటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. 
 
బేద్కర్ 125 అడుగుల విగ్రహం పనుల పురోగతిని పరిశీలించేందుకు ఎన్టీఆర్ గార్డెన్ పక్కనున్న స్థలాన్ని బిజెపి శాసనసభ పక్ష నేత రాజాసింగ్ తోపాటు ఇతర బీజేపీ నాయకులతో కలిసి బండి సంజయ్ సందర్శించారు. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన అంబేద్కర్ విగ్రహం పనులు నేటికీ విగ్రహ పనులు పూర్తికాలేదని విమర్శించారు.
ఏడాదిలో అంబేద్కర్ జయంతి నాటికి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇక ఆ తరువాత ఆ ఊసే లేదు అని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా వెళ్లని మూర్ఖుడు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక మొట్టమొదట మోసం చేసింది దళితులనే అని చెబుతూ  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీని విర్మరించారని గుర్తు చేశారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేశాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని మాయ మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల సంగతి దేవుడెరుగు…. వాళ్ల పేరిటనున్న అసైన్డ్ భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర కేసీఆర్ ది అని ఆరోపించారు.