విదేశీ మోజులో కెనడా సరిహద్దుల్లో మరణించిన గుజరాతీ కుటుంబం

విదేశీ మోజులో కెనడా సరిహద్దుల్లో మరణించిన గుజరాతీ కుటుంబం
కెనడా/అమెరికా సరిహద్దు సమీపంలోని మానిటోబాలో ఈ నెల 19న మంచుతుపానులో చిక్కుకుని సజీవసమాధి అయిన నలుగురు సభ్యులతో కూడిన ఒక భారతీయ కుటుంబ ఆచూకీని కెనడా ప్రభుత్వం నిర్ధారించినట్లు ఇక్కడి భారతీయ హైకమిషన్ తెలిపింది. 
 
మంచుతుపానులో కూరుకుపోయి మరణించిన నలుగురు వ్యక్తులను జగదీష్ బైదేవ్‌భాయ్ పటేల్ (పురుషుడు–39), వైశాలిబెన్ జగదీశ్‌కుమార్ పటేల్ (స్త్రీ-37), విహంగి జగదీశ్‌కుమార్ పటేల్ (పాప11), ధార్మిక్ జగదీష్‌కుమార్ పటేల్ (బాబు-3)గా గుర్తించినట్లు భారత హైకమిషన్ తెలిపిది. గుజరాత్‌కు చెందిన ఈ కుటుంబానికి చెందిన బంధువులకు సమాచారాన్ని అందచేసినట్లు హైకమిషన్ తెలిపింది.
 
జగదీశ్‌ కుటుంబం స్వస్థలం గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లా కలోల్‌ తహశీల్‌లోని దింగుచా గ్రామంగా తెలిసింది. ఈ గ్రామం నుంచి చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు అధికారిక పత్రాలతో వెళ్లి విదేశాల్లో సెటిలవగా మరికొందరు టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విదేశాల్లో జీవించడం ఈ గ్రామంలో గౌరవంగా పరిగణిస్తారు. 
 
విదేశాల్లో బంధువులు లేకపోతే ఇక్కడ పెళ్లి సంబంధలు కూడా దొరకడం కష్టమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతోంది. ఆ గ్రామంలో ఉన్న అందిరిలాగే తాను కూడా కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడాలని జగదీశ్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గ్రామంలో  తనకున్న 12 ఎకరాల పొలాన్ని విడిచి ఇంట్లో పెద్దలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా జనవరి 12న కుటుంబంతో సహా కెనాడా ఫ్లైట్‌ ఎక్కారు.
అక్కడ తెలిసిన వారి సాయంతో అనధికారికంగా అమెరికాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  జనవరి 19న స్థానిక ఏజెంట్ల సాయంతో కెనడాలోని మానిటోబా దగ్గర సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. సరిహద్దులో ఉండే అధికారుల కళ్ల బడకుండా ఉండేందుకు ప్రధాన రహదారి, వాహనాలను విడిచి, కాలి నడకన  సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
 
జగదీశ్‌ కుటుంబం సరిహద్దు దాటే క్రమంలో మైనస్‌ 35 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచు విపరీతంగా కురవడంతో పాటు తీవ్రమైన గాలులు వీయడం మొదలైంది. ఈ ప్రతికూల వాతావరణానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడంలో జగదీశ్‌ కుటుంబం విఫలమైంది. 
 
మరోవైపు సరిహద్దు దాటించేందుకు సాయం చేస్తానన్నా ట్రావెల్‌ ఏజెంట్లు గస్తీ ఎక్కువగా కావడంతో మార్గమధ్యంలోనే వారిని వదిలేశారు. ఈ విపత్కర పరిస్థితిలో చలికి తట్టుకోలేక అమెరికా సరిహద్దులకు సమీపంలో కెనెడా వైపు వీరు ఊపిరి వదిలారు. తమ కలల జీవితం నెరవేర్చుకునే క్రమంలో విగత జీవులుగా మారారు.
అరెస్ట్ చేసిన 7గురిని భారత్ కు పంపనున్న అమెరికా 
 
మరోవంక, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అమెరికా/కెనడా సరిహద్దుల్లో గత వారం అరెస్టయిన ఏడుగురు భారత జాతీయులను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ నుంచి విడుదలైన తర్వాత భారత్‌కు పంపించి వేయనున్నారు. 
 
ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఆ ఏడుగురు భారత జాతీయులను వారి సదేశానికి పంపించివేస్తామని ఒక ప్రకటనలో అమెరికా బార్డర్ ప్రొటెక్షన్ తెలిపింది.
 
ఏడుగురు భారత జాతీయులను ఆరుగురు ఇప్పటికీ తమ అదుపులో ఉన్నారని, ఒకరిని మాత్రం మానవతా దృక్పథంతో విడుదల చేశామని తెలిపింది. బార్డర్ పెట్రోల్ కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వీరందరినీ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు. 
 
గుజరాత్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఈ ఏడుగురు భారత జాతీయులను గత వారం అమెరికా అధికారులు అమెరికా/కెనడా సరిహద్దుల్లో అరెస్టు చేశారు. ఈ మానవ అక్రమ రవాణాకు పాల్పడిన స్టీవ్ షాండ్ అనే 47 ఏళ్ల వ్యక్తిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు.