
దేశంలో అధిక భాగం మొఘలాయిల పాలనలో ఉన్న సమయంలో, గోవా పోర్చుగల్ వారి పాలన కిందికి వెళ్లిందని, అది గడచి, ఇన్ని సంవత్సరాలైనా.. గోవా భారతీయతను మరిచిపోలేదని, గోవాను భారతీయులు మరిచిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.
గోవా విమోచన ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం గోవాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవా విముక్తి కోసం పోరాడిన వారిని సన్మానించారు. భారత్ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ ఇంకొంచెం కాలం జీవించి ఉంటె గోవాకు ఇంకా ముందుగానే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ మరికొంతకాలం బతికి ఉంటే గోవా త్వరగానే విముక్తి సాధించేదని ప్రధాని చెప్పారు. గోవాకన్నా ఎంతో ముందుగానే దేశం స్వాతంత్య్రం సాధించినప్పటికీ, ఆ వేడుకను సంతోషంగా జరుపుకోలేకపోయారని ప్రధాని గుర్తు చేశారు. కొంతభాగం విదేశీయుల పాలనలో ఉండటమే అందుకు కారణమని పేర్కొన్నారు.హైదరాబాద్ లో నిజాం పాలనకు ముగింపు పలికిన పటేల్, గోవాను కూడా విముక్తి కలిగించే ఉండేవారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఇటీవల తాను ఇటలీ, వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లినప్పుడు పోప్‌ను కలిసే సందర్భం వచ్చిందని, అప్పుడు భారత్‌లో పర్యటించాలని ఆయన్ను ఆహ్వానించానని పేర్కొన్నారు. దీనికి పోప్ సమాధానమిస్తూ… ఓ అద్భుతమైన గిఫ్ట్‌ను నాకు బహూకరించారని పోప్ అన్నారని మోదీ తెలిపారు.
”చాలా రోజుల క్రితం నేను ఇటలీ, వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లా. పోప్‌ను కలుసుకున్నా. భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించా. అప్పుడు పోప్ స్పందిస్తూ… మీరు నాకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇదే. మన దేశ ప్రజాస్వామ్యం, వైవిధ్యత విషయంలో పోప్‌కున్న అపారమైన ఆదరణ ఇది” అని మోదీ తెలిపారు.
సుపరిపాలనతో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు. గోవా ప్రజలు శాంతియుతంగానే మెలుగుతున్నారని, క్వీన్ కెతావన్ అవశేషాన్ని చాలా సంవత్సరాల పాటు భద్రపరిచారని, గోవా ప్రజలను ఎంత ప్రశంసించినా తక్కువేనని మోదీ కొనియాడారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రవర్తన ద్వారా ఈ రాష్ట్ర (గోవా) ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో, ఎలా కష్టపడుతారో దేశం మొత్తం చూసిందని ప్రధాని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతాడనే విషయాన్ని మనం మనోహర్ పారికర్ జీవితం ద్వారా చూశామని చెప్పారు.
గోవా రాష్ట్రానికి అన్ని అంశాల్లో అగ్రస్థానమేనని పేర్కొంటూ సుపరిపాలనలో, తలసరి ఆదాయంలో ఇంకా చాలా అంశాల్లో గోవాదే ముందంజ అని ప్రధాని ప్రశంసించారు. అదేవిధంగా గోవాలో సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ప్రధాని తెలిపారు. గోవాలో అర్హులైన వారిలో 100 శాతం మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. అందుకు గోవా సర్కారును అభినందించారు. గోవా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ భారీ లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రధాని కొనియాడారు.
More Stories
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ముస్లిం మతగురువు తౌకీర్ రాజా అరెస్టు
మూసీ వరద ఉధృతికి ముంపుకు గురైన ఎమ్జీబీఎస్ బస్టాండ్