అంబేద్క‌ర్‌ను ఎల్లప్పుడూ అవమానిస్తున్న కాంగ్రెస్ 

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను ఆయన జీవించి ఉన్న సమయంలో,  మరణించిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూ వచ్చిందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ఆరోపించారు. సంవిధాన్ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన గుర్తు చేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి శంకుస్థాపన చేసేందుకు పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన అమిత్ షా ఈ సందర్భంగా బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. “సంవిధాన్ (రాజ్యాంగం) అందరికీ సమాన హక్కులను ఇస్తుంది. అయితే, అంబేద్కర్జీ జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా ఆయనను కించపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు” అని షా ధ్వజమెత్తారు.

అంబేద్కర్‌కు కాంగ్రెసేతర ప్రభుత్వం (మరణానంతరం) మాత్రమే  భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో, ప‌లు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే అంబేద్క‌ర్‌తో అనుబంధ‌మున్న ఐదు ప్రాంతాల‌ను స్మృతి స్ధలాలుగా మార్చామ‌ని గుర్తు చేశారు.

అంబేద్కర్ వారసత్వం ఎక్కువ మందికి చేరుతుందనే భయంతో సంవిధాన్ దివస్ లేదా రాజ్యాంగ దినోత్సవాన్ని ముందుగా జరుపుకోలేదని అంటూ కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. ‘‘నరేంద్ర మోదీజీ ప్రధాని కాగానే ‘సంవిధాన్‌ దివస్‌’ సంబరాలు మొదలయ్యాయి.. కానీ మోదీజీ సంవిధాన్‌ దివస్‌ జరుపుకున్నప్పుడల్లా కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గురించి మాట్లాడుతోంది” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ నుండి వ్యతిరేకత ఎదురవుతున్నా ఎటువంటి భయం లేకుండా అంబెడ్కర్ స్వతంత్ర భారతంకు అందించిన రాజంగం విలువలను, సుపరిపాలనను అందించాలని బిజెపి కృషి చేస్తున్నదని అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ కృషిని గుర్తిస్తుందని, ప్రధాన మంత్రి రాజ్యాంగాన్ని తన మార్గదర్శిగా భారత దేశాన్ని నడిపిస్తున్నారని ఆయన తెలిపారు.

పుణె విమానాశ్రయం సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రధాని అనుమతి ఇచ్చారని చెబుతూ  త్వరలో ప్రారంభించనున్న పూణే మెట్రోకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారని చెప్పారు. పర్యతికులకు ఆకర్షణీయంగా మారిన ముంబై-పూణే విస్టా డోమ్ (కోచ్)ను కేంద్రం ప్రారంభించిందని గుర్తు చేశారు.

“పూణేలో రూ. 110 కోట్ల మూలా-ముఠా నది ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ప్రధాని పూణేలో స్టార్టప్‌లకు కూడా మద్దతు ఇచ్చారు. భారతదేశ ప్రతిష్టను మెరుగుపరచడంలో సహాయపడే అనేక స్టార్టప్‌లను ఈ నగరం అందించింది,” అని వివరించారు. .

హిందుత్వం విషయంలో రాజీపడిన ఠాక్రే 

 కాగా, అధికారం కోసం హిందుత్వ విష‌యంలో శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీ ప‌డ్డార‌ని  అమిత్ షా ఆరోపించారు. సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో కూడిన మ‌హా వికాస్ అఘ‌డి (ఎంవీఏ) స‌ర్కార్ ప‌నితీరు పేల‌వంగా ఉంద‌ని మండిప‌డ్డారు. ఎంవీఏ స‌ర్కార్‌ను భిన్న‌దారుల్లో వెళుతున్న మూడు చ‌క్రాల బండిగా అభివ‌ర్ణించారు.

ఈ ప్ర‌భుత్వం సాఫీగా సాగ‌డం లేద‌ని కేవ‌లం కాలుష్యం వెద‌జ‌ల్లుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-శివ‌సేన క‌లిసి పోటీచేసి మెజారిటీ సాధించినా ఠాక్రే నేతృత్వంలోని పార్టీ ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కు వెళ్లింద‌ని గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల‌తో కూడిన ఎంవీఏ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర‌లో కొలువుతీర‌గా బీజేపీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంద‌ని చెప్పారు.

2019లో బీజేపీ నుంచే సీఎం ఎన్నిక‌వుతార‌ని తాను చెప్పినా అధికార దాహంతో వారు హిందుత్వ‌తో రాజీప‌డ్డార‌ని అమిత్ షా ధ్వజమెత్తారు.

త్వరలో సహకార యూనివర్సిటీ 

కాగా, సహకార రంగానికి సంబంధించిన శిక్షణా కోర్సులతో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని , అనుబంధంగా కళాశాలలను నెలకొల్పుతుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా  చెప్పారు. పూణేలోని ఆదివారం జరిగిన వైకంఠ మెహతా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ (వమ్నికం) స్నాతకోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. సహకార రంగంలో వాణిజ్య అవకాశాలను విస్తరింపజేసేందుకు త్వరలో కొత్త కోఆపరేటివ్‌ పాలసీ తీసుకొస్తామని ఆయన చెప్పారు.