కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు

కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు

కేసీఆర్‌‌ ఎంత గట్టిగ మాట్లాడ్తడో అంత పిరికోడు అంటూ మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.  హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు భూమ్మీదికి దిగొచ్చిండని, ఫామ్ హౌజ్ నుంచి బయటికొచ్చి ధర్నాచౌక్ లో పడ్డడని గుర్తు చేశారు. 

” కేసీఆర్ వ్యూహాలన్నీ నాకు తెలుసు. ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంట. ఇటు సూర్యుడు అటు పొడిచినా కేసీఆర్ గెలవడు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగే రోజులు దగ్గర్నే ఉన్నయి” అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడుతూ హుజూరాబాద్ తీర్పు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ ప్రళయం రానుందని, దాన్ని కేసీఆర్ తట్టుకోలేరని రాజేందర్ హెచ్చరించారు. ‘‘ప్రజలే చరిత్ర నిర్మాతలు. అట్ల కాకుంటే పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ  ప్రధాని అయ్యేవారు కాదు. ప్రజలు న్యాయం, ధర్మం పాటించకుంటే నేను మళ్లీ ఎమ్మెల్యే అయ్యేవాన్ని కాదు” అని పేర్కొన్నారు. 

మోదీ ప్రభుత్వం మీద ఒక్క మరక లేదని ఒక్క కుంభకోణం లేదని చెబుతూ  ఆకలి తెలిసిన వ్యక్తి ప్రధాని అయితే ఏం చేయొచ్చో ఆయన చూపించారని ఈటెల కొనియాడారు. ధాన్యం కొనలేక కేంద్రంపై కేసీఆర్‌‌ నెపం మోపిండని అంటూ  రైస్ మిల్లులు పెట్టలేకపోయినందుకు కేసీఆర్‌‌ రెండు చెంపలు వేసుకోవాలని ధ్వజమెత్తారు. 

బియ్యం కొనలేకపోయానని కేసీఆర్ ఒప్పుకోవాలని హితవు చెబుతూ కేసీఆర్‌‌ అబద్ధాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు.  ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని, ప్రజల కన్నీళ్లకు పరిష్కారం బీజేపీతోనే అని స్పష్టం చేశారు. అధికారం కోసం కాదని,  ప్రజల కోసం బీజేపీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి చెప్పారు.