బియ్యం సేకరణలో పారదర్శక, సార్వత్రక విధానం  

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి బియ్యం సేకరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన, సార్వత్రకమైన విధానాన్ని అనుసరిస్తోందని, ఎక్కడా ఏ అయోమయం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఎప్పుడూ పరిర క్షిస్తుందని, ఏటా ధాన్యం సేకరణ పెరుగుతూనే ఉందని తెలిపింది. 
 
లోక్‌సభలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, టిడిపి ఎంపీల  ప్రశ్నలకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి సవివరంగా సమాధానమిస్తూ 2021-22లో కేంద్ర పూల్‌ ద్వారా 521.89 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించామని.. రబీ సీజన్‌ ప్రారంభమైనప్పుడే రబీ (యాసంగి) పంటకు లక్ష్యం నిర్ణయిస్తామని చెప్పారు.
 
తెలంగాణలో 2020-21లో రబీ సీజన్‌లో సేకరణ లక్ష్యం 55 లక్షల టన్నులుగా నిర్ణయించినప్పటికీ 61.87 లక్షల టన్నుల మేరకు సేకరించామని ఆమె వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25 నాటికి రబీ, ఖరీఫ్‌ సీజన్‌లకు కలిపి తెలంగాణ నుంచి 94.53 లక్షల టన్నులను సేకరించామని, 2019-20లో సేకరించిన 74.54 లక్షల టన్నులకంటే ఎంతో ఎక్కువ సేకరణ ఇప్పటికే జరిగిందని పేర్కొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2019-20లో 55.3 3లక్షల టన్నుల బియ్యం సేకరించగా.. 2020-21లో అది 56.67 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ డిమాండ్‌తో 2020-21లో ఉప్పుడు బియ్యం సేకరణను కూడా 24.75 లక్షల టన్నుల నుంచి 44.75 లక్షల టన్నుల మేరకు పెంచామని ఆమె తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించామని చెప్పారు. 
 

ధాన్యం సేకరణ విధానం రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతుందని,  అదనపు మార్కెట్‌ నిల్వలే కాక, స్థానిక ఆహారపు అలవాట్లు, స్థానిక అభిరుచికి అనుగుణంగా పండించే వెరైటీలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ఎగుమతిని బట్టి సేకరణ జరుగుతుందని ఆమె తెలిపారు. 

ఏటా బియ్యం సేకరణ దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నదని, 2018-19లో 443.99 లక్షల టన్నుల సేకరణ జరగగా.. అది 2019-20లో 518. 26 లక్షల టన్నులకు, 2020-21లో 600.74 లక్షల టన్నులకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ సేకరణ కూడా పెరుగుతుందని అమె పేర్కొన్నారు.

పంటమార్పిడిని ప్రోత్సహించాలని అన్ని రాష్ట్రాలకూ సలహా ఇచ్చామని, పప్పుధాన్యాలు, చమురు గింజలు, తృణధాన్యాలకు కనీస మద్దతు ధరను ఇతోధికంగా పెంచి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించినట్టు ఆమె వివరించారు.

కాగా,  భారత ఆహార సంస్థ ఆస్తులను అమ్మే ఆలోచన లేదని, ఎఫ్‌సీఐ తన సొంత గోదాములు, ప్రైవేటు గోదాములతో కలిపి 414.70 లక్షల టన్నుల మేరకు నిల్వ చేయగలదని మంత్రి చెప్పారు. తమ ఆపరేషన్ల ద్వారా ఎఫ్‌సీఐ 2020-21లో 2,62,696 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.