దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా భారతీయులే 

ఇప్పటికే ఐటీలో మేటిగా ఎదిగిన భారతావని.. సుశిక్షిత నిపుణులకు కేంద్రంగా మారుతున్నది. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. ఆల్ఫాబెట్‌-గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబి, ఐబీఎం వంటి ప్రపంచస్థాయి  దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ   సీఈవోలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్నారు. గూగుల్‌ను సుందర్ పిఛాయ్‌ ముందుకు నడిపిస్తున్నారు. ఐబీఎం అరవింద్ కృష్ణ ఆధ్వర్యంలో సాగుతోంది. ఇక అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేష్‌ ఆరోరా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌‌గా సేవలందిస్తున్నారు. 
 
ఇలా అమెరికా కంపెనీల్లో ప్రవాస భారతీయుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా అభివృద్ధి, అక్కడ కంపెనీల ప్రగతిలో మనోళ్లదే కీలక పాత్ర. అజయ్‌బంగా (మాస్టర్‌కార్డ్‌), సంజయ్‌ మోహ్రోత్రా (మైక్రాన్‌ టెక్నాలజీ), ఇంద్రానూయీ (పెప్సికో మాజీ సీఈవో), నికేశ్‌ అరోరా (పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌), రంగరాజన్‌ రఘురాం (వీఎమ్‌వేర్‌), జయశ్రీ ఉల్లాల్‌ (అరిష్టా నెట్‌వర్క్స్‌), జార్జ్‌ కురియన్‌ (నెట్‌యాప్‌), రేవతి ఐద్దెతి (ఫ్లెక్స్‌), అంజలి సూద్‌ (విమియో) వంటి వారు సహితం కీలక స్థానాలలో ఉన్నారు. 
 
ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ  మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌‌కు కొత్త సీఈవోగా 37 ఏళ్ల భారతీయ టెకీ పరాగ్ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఆయన  అజ్మీర్‌ (రాజస్థాన్‌)లో పుట్టారు. తల్లి రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌, తండ్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీలో ఉన్నతాధికారి.   ఐఐటీ-బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌, స్టాన్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ చేశారు. 
 
ఈ సందర్భంగా పరాగ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఐర్లాండ్‌కు చెందిన ఆన్‌లైన్ పేమెంట్స్‌ కంపెనీ ‘స్ట్రైప్’ సీఈవో పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. 
‘‘ఇప్పటి వరకూ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌.. ఇప్పుడు ట్విట్టర్‌‌కు కూడా సీఈవోగా భారత దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తే నియమితులయ్యారు. ఇలా టెక్నాలజీ రంగంలో భారతీయులు అద్భుతంగా విజయవంతం కావడం చూస్తే చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. 
 
అమెరికాకు వలస వస్తున్న వారికి ఆ దేశంలో అవకాశాల విషయంలో పెద్ద పీట వేస్తున్నారన్న దానికి ఇదే నిదర్శనం అంటూ పాట్రిక్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ప్ర‌తిభావంతులైన భార‌తీయుల వ‌ల్ల అమెరికా ల‌బ్ధి పొందుతున్న‌ట్లు  ప్రవాస భారత టెకీలను ప్రశంసిస్తూ   టెస్లా సీఈవోఎల‌న్ మ‌స్క్  ట్వీట్ చేశారు. 
 
దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా వరుసగా భారతీయులే రావడాన్ని కరొనాతో పోల్చుతూ ప్రముఖ భారతీయ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “ఈ మహమ్మారి భారత్ లో ఉధ్బవించిందని చెప్పడానికి ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈవో వైరస్. దీనికి అస్సలు వ్యాక్సిన్ లేదు అంటూ ట్వీట్ చేశారు.