ఆఫ్రికా విమానాలపై ఆంక్షలపై ఆగ్రహం

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగు చూడటంతో ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం లేదా ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ జాబితాలో ఇయు దేశాలు, బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇరాన్, అమెరికా చేరాయి. తమ దేశ విమానాలపై ఆంక్షలు విధించడం పట్ల దక్షిణాఫ్రికా ఘాటుగా స్పందించింది. 

పారదర్శకంగా వాస్తవాలు వెల్లడిస్తున్నందుకు తమపైనే ఆంక్షలు విధిస్తారా? అంటూ ఆ దేశ ఆరోగ్య సమాఖ్య ప్రశ్నించింది. ఆంక్షలు విధించిన 18 దేశాలనుద్దేశిస్తూ తొందరపాటు చర్యగా అభివర్ణించింది. ఇది ప్రమాదకరమైందని చెప్పేందుకు ఇప్పటివరకు తగినంత సమాచారం లేదని సమాఖ్య చైర్మన్ యాంజిలికే కోయెట్జీ స్పష్టం చేశారు.

తమ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ సీక్వెన్సింగ్‌పై ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వేరియంట్‌లో డెల్టా లక్షణాలు లేవని, బీటా లక్షణాలున్నాయని ఆయన తెలిపారు. వీటిని తేలిగ్గా అధిగమించవచ్చునని పేర్కొన్నారు. అయితే, యువకులు ప్రత్యేకించి పురుషులు ఎక్కువగా దీని బారిన పడటంతో తాము అప్రమత్తమయ్యామని ఆయన తెలిపారు. ఆయాసం, ఒంటి నొప్పులు, తలనొప్పి, గొంతులో గీర (కొంత ఇబ్బంది) ఈ వేరియంట్ వల్ల తలెత్తడాన్ని గుర్తించామని ఆయన వివరించారు. 

కాగా,  ‘ఒమిక్రాన్’ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్ చేరాయి. ఆదివారం ఆస్ట్రేలియా వైద్యాధికారులు రెండు కేసుల్ని గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి దోహా మీదుగా శనివారం రాత్రి సిడ్నీ చేరుకున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. 

అయితే, వీరిలో కరోనా  సోకిన లక్షణాలు లేవని, వీరిద్దరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారని వైద్య నిపుణులు తెలిపారు. వీరిద్దరినీ క్వారంటైన్‌కు పంపారు. వారితో సన్నిహితంగా మెలిగినట్టు అనుమానమున్న 260 మంది ప్రయాణికులు,సిబ్బందిని కూడా ఐసోలేషన్‌కు పంపారు. మొత్తం 9 ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను హోటళ్లలో క్వారంటైన్‌కు పంపిస్తున్నారు.

మరోవంక, తమ దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు 13 నమోదయ్యాయని నెదర్లాండ్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి విమానాల్లో శుక్రవారం తమ దేశానికి చేరుకున్నవారికి పరీక్షలు నిర్వహించగా 61 మందికి పాజిటివ్ రాగా, వారందరినీ హోటళ్లలో ఐసోలేషన్‌కు పంపామని వారు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో 13మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

గత వారం రోజులుగా ఆఫ్రికా ప్రాంతం నుంచి స్వదేశం చేరుకున్నవారందరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని నెదర్లాండ్ అధికారులు సూచించారు. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నమోదైన జాబితాలో బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్,జర్మనీ,జెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, ఇటలీ, బ్రిటన్ (రెండు కేసులు) చేరాయి. హాంకాంగ్‌లో నమోదైన రెండు కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే కనిపించాయని ఆ దేశ శ్వాసకోశవ్యాధుల నిపుణుడు డేవిడ్ హూ తెలిపారు. 

వీరిద్దరూ ఫైజర్ టీకా తీసుకున్నారని ఆయన వెల్లడించారు. దీంతో, టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో అనారోగ్య సమస్యలు తీవ్రంగా లేవని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్లు కొంత పని చేస్తున్నా, పూర్తి సామర్థం చూపలేకపోతున్నాయని చెప్పారు. 

అమెరికాలోనూ ఒమిక్రాన్ కేసు నమోదైతే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీఫౌసీ పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకూ తమ దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. వ్యాప్తిరేట్ అధికంగా ఉన్న వైరస్‌లు ఎక్కడికైనా సులభంగా వ్యాపించగలవని ఆయన చెప్పారు. 

ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి ఓలివీర్ వెరాన్ తెలిపారు. డెల్టా వేరియంట్ వల్ల తమ దేశంలో కేసులు పెరిగిన నేపథ్యంలో తాము వ్యాక్సినేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టామని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ వ్యూహం కొనసాగుతుందన్నారు.